Thursday, May 29, 2014

నీటి స్పటికం


చెమ్మ ఇంకిన కిరణాలు పొద్దూకులా ఇంటి ముందు పడుంటాయి
వాటినెవరో ఇక్కడ పారబోసినట్టు పచ్చి గుర్తులు

కిటికీలోంచి నా కళ్ళు వాటిని ప్రతిరోజూ కడుగుతుంటాయి మబ్బుపట్టకుండా
అవి తడుస్తూనో నన్ను తడుపుతూనో ఉంటాయి

రాత్రి మిగిలిన సగం విరిగిన కలలా
నన్ను నడిపించే కాళ్ళలా నాతోనే

ఇప్పుడు కొన్ని ఆకులు మళ్ళా రాలాలి వాటి కోసం పనిమాలా
పిట్టగోడపై  చెకోరపక్షిలా ఎటు ఎగరాలో తెలియని క్షణం

కొంత ఎర్రమట్టిని అరచేతుల్లో పొదువుకొని
ఆకాశపు మొదళ్ళలో అంటుకడుతుండే ఆనవాళ్ళు
భూమిపై కూర్చున్న సముద్రమొకటి లేచి వెళ్ళినప్పుడు
అవే చేతులు  కొత్త ప్రతిబింబంలా హత్తుకుంటాను

కనిపించని అస్పష్టతను  వెంటతెచ్చుకొనే మొసళ్ళు
ఈ బంధాలు గాలివేర్లలా


Wednesday, May 28, 2014

కలల కూడలి


పదాల మధ్యన నేను
నాలోకి  కొన్ని వాక్యాలుగా ఇంకినపుడు మధ్యమంగా మరికొన్ని భావాల వెల్లువ

నరాలు పగిలేలా రుధిరపు హోరు గుండె గతుకుల్లో
అవి తట్టనపుడూనూ/­నావికానపుడూనూ

మనసు సాంద్రత పెరిగి దళసరి ధూపమేదో నన్ను కాల్చుతుండగా కొత్త అర్థాలకు మూసపోస్తూ నా ఈదేహపు బట్టీ

నా కళ్ళలో పగిలిన పాలసంద్రాలన్నీ నాకు నేనె వడగొట్టుకుంటూ ద్రవీకరిస్తున్నా ఇప్పుడే...ఇక్కడే అమరణపు అంపసయ్య ఆలోచనలను

నేను మళ్ళా పుట్టడానికి ప్రయత్నిస్తుంటాను..ఆ పసితనపు పుప్పొడిని నా కాగితపు కూడలిలో కొద్ది కొద్దిగా అద్దేందుకు

ఇంకా ఏదో నిర్లిప్తత రాసి జీవించినా
రాయక మరణించినా

Tuesday, May 27, 2014

నల్ల అద్దం

ఎక్కడికో విసిరివేయబడతాను కొన్నిసార్లు నాకు నేనె దూరంగా
అప్పుడక్కడ విరిగిపడిన శిలాశఖలాలలు కళ్ళ అంచులతో ఏరుకుంటాను

వాకిలి ముందు నేలపగుళ్ళపై జల్లిన కళ్ళాపి లేపనంలా
మది గుహలన్నీ పచ్చిగానే నానుతూంటాయి

అంతరంగ వైశాల్యాన్నీ కొలిచే కొత్త బావుటాలకు లోలోపలే చేదవేస్తూ
పాకుడు గోడలపై గొంగళిపురుగులా మరో వేట

నాలో రంగులద్దుకున్న ఎండు వారధులు
వాటి పునాదుల  మధ్యగా మళ్ళీ నేనె

చిట్లిన ఉప్పు నీటికి అతుకులేస్తూ  కలల సాంద్రతను వడగొడుతూ ఇంకో అన్వేషణ
ఇనుప గడియారంలో నిర్లిప్త శత్రువులు నా ఆప్తులు

మరికొన్ని అణువులు పేర్చుకోవాలి తెగిపడకుండా
ఇక్కడి నేలంతా ఎన్నిసార్లు నన్ను రాసిందో  విరిగిన ప్రతిసారీ

కొంత సాంత్వన ముసురు దుప్పట్లన తడిసిన చంద్రుడి సాలేగూటిలా
నన్నెవరో పోగేయ్యాలి మళ్ళా లోతునుండి బయటికొచ్చాక

Sunday, May 25, 2014

వాన దీపం


గోడకు తగిలించిన దీపం రాత్రంతా వెలిగి వెలిగి ఇప్పుడే కొండెక్కింది
ఒంటరిగా తనను తను కాల్చుకున్నాక ఒంటిపై మిగిలిన మసి

ఇంటి చూరు కూడా చేతులు చాపి రేయంతా మెలకువగానే తోడుకుంది ఇంత చీకటిని
ఎక్కడో దడాలున పగిలిన కీచురాళ్ళ శబ్ధానికి కొంచం జలదరిస్తూ ఒకింత అలజడి గాజు దేహం గుండా

ముసలి వర్షమొకటి అప్పుడే అటుగా వెడుతూ తలతిప్పి చూసింది దహనమవుతున్న ఏకాంత ఒత్తిని/ఒక్కో చుక్కా రాలే కొద్ది నేలంతా తడిసిన వాసనతో నానుతోంది

ఇక కొద్దిగానే నిండుకున్న చమురుతో నెట్టుకొస్తున్న ఆ పదార్థానికి శూన్యపు గాలికి కిర్రుమన్న చప్పుడు

ఆకుల మధ్యగా కొన్ని పువ్వులు అప్పుడే రాలినట్టున్నాయి పసిరుచిగొడుతూ
ఇంకెన్ని రాతులు దహనమవ్వాలో ఒంటరైనా ఆ గది కోసం
తిలక్ బొమ్మరాజు

Thursday, May 15, 2014

వర్ణం

ఇంకా ఎన్ని రంగులు పులుముకోవాలో
కొన్ని దృశ్యాలాను ఈ ముఖంలో కప్పెట్టడానికి 

ప్రతి రోజు కొన్ని వాత్సల్యాలను అద్దుకొని ప్రేమించేస్తావు నగ్నంగా
కళ్ళలో నిజాలు గుర్తించలేని సమయాలు ఎన్నో కరుగుతుంటాయి నీ ముందే

కనిపించే వర్ణాల వెనుక మబ్బుపట్టిన చీకట్లు

భల్లెం దెబ్బకి రెక్కలు విరిగిన కొన్ని కపోతాలు ఇప్పుడిక్కడ
 ఇంకా రంగులు మారుతూనే ఉన్నాయి
ఈ దేహంపైన నీ దేహంలో కలవడానికి

తిలక్

చీకటి వాసన

ఇంకొన్నాళ్ళు ఆగాలేమో కొత్త రెక్కలు విచ్చుకోవడానికి అన్నం మెతుకులు చేతులకంటనే లేదు అప్పుడే ఆకలిసముద్రాన్ని దాటేస్తే ఎలా

చీకటి తైలం ఇంకిపోయిన నేలంతా రాత్రి వాసనను కప్పుకొని బయటకొచ్చింది

చేతుల్లోకి కాసింత శూన్యాన్ని తోడుకుని ముఖాన్ని చదును చేసుకుంటూ ఇంకో క్షణం

మట్టి గొంతులో కుక్కబడిన వేర్ల చిరునామాలన్నీ ఆకులతో కుప్పపోసాక లోన మిగిలిన ఓకింత ఖాళీ

నవ సమాధుల నిర్మాణం జరుగుతూనే ఉంది ఎక్కడోచోట ప్రతి రోజు
పాత శాసనాలను కొత్తగా లిఖిస్తూనే ఉన్నా

మరో రెండు శరీరాలు కోరికల ముసుగులో మరణించాక ఇంకో ఆకలి పుడుతూ వెంట తేలేని లిప్తపాటు కాలాన్ని నీతిప్రమణాలతో కొలుస్తూ డోలాయనం

ఇప్పుడిక ఎగరొచ్చు సరిహద్దులు దాటి