Thursday, February 5, 2015

రాత్రి దీపం

ఈ రాత్రి చల్లగా కురుస్తున్న ఓ దీపం కదా నీకు నాకు 
మంచు బిందువులన్నీ బాల్కనీ అంచులమీద నిలబడిన పువ్వులై 
కొన్ని అరుపులు వినీ వినబడకుండా 
కొంత దూరంలో ఒక కుక్కో అంతకు మించిన జీవమో
ఏదోకటి మనల్ని పలకరిస్తుంది
ఇక అప్పుడు సర్దిన పక్క ఓ నాలుగు తలగళ్ళు మనకు చుట్టాలై పలకరిస్తాయి
అప్పుడు నిద్రపట్టని మనం నిద్రపోని రోడ్డు మీద అరికాళ్ళతో నడుస్తాము కాస్త దూరం
ఇంకొంత దూరం
కొన్ని మాటలూ దొర్లుతాయప్పుడు ఆ నిశ్శబ్దంలో
గబ్బిలపు రొదల్లో ఇన్నాళ్ళు చేతులంటిన ఒక మనం అలా అలా ఓ తీరపు మట్టిలా రేగి పడతాము ఒక పక్కగా
పగిలిన గాజు ముక్కలు మరికొన్ని తెల్లటి మందారాలు
ఇవిగో అనే నేను
ఎలాగోలా అల్లడానికి ప్రయత్నిస్తాను నీకర్థమయ్యే మాటలనే
కానీ అప్పుడంటావు!ఏమిటీ ఈరోజు కొత్తగా నీ నోటిపూత నన్ను పిలుస్తోందని
పెదవుల యుద్ధం ముగిసాక ఒకలా ప్రేమించుకుంటాము
నువ్వో నేనో పొత్తికడుపులో తల దాచుకుని ఏడుస్తాం
ఇంత దానికే ఇలా అయితే ఎలా చెప్పు అని నువ్వడగడం
ఏం చెప్పాలో తెలియని స్మశానవాటికలో పదాలు కట్టడం మామూలే
ఇంకేముంటాయి అప్పుడు మళ్ళా మనలో మనమేగా
కాసేపు చలిలో డాబా మీదో పిట్టగోడ మీదో అర్దరాత్రుళ్ళు బొమ్మలేస్తాం
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుంటాం అంతే కాంక్ష దాటిన ఒక ఊరిలో
మళ్ళా కలుస్తాం ఇంకోరోజు.

అసమాపకం


కొన్ని ప్రతీకార చర్యలను ఇలానే మన చుట్టూ రాట్నంలా అల్లుకుంటాం
పగళ్ళను రాత్రితో కలుపుతూ ఆ రెంటి మధ్య కొన్ని కలలనో,మహా అయితే ఇంకొంత జీవితాన్నో
పొద్దున్నే రెప్పలు తెరిచే మొక్కలూ 
జరుపుకునే కిరణజన్యసంయోగక్రియ
నీ కళ్ళు చూస్తాయి చూడు ఒక కొత్తదనాన్ని
ఎలా దాచుకోవాలో తెలియక సిగ్గుతో కొన్ని పూలు పూస్తాయి పచ్చగా గుండె అంతా పచ్చిగా
వల్లెవేసే దారులను వెతుక్కుంటాం ఒక కూడలిలో కాలభైరవుడికి ఉనికిని వెతికే పనిలో
ఎటెళ్ళాలో తెలియక దారితప్పి ప్రచండ జపాన్ని పహారాగా పెట్టి
బొమ్మలేవో మన గది గోడలపై నిరాకార ప్రశ్నలుగా
రాత్రి కాలిన కొవ్వొత్తి పొగా
కర్టెన్లు అలా ఎంతసేపటి నుండి రమించి ఉన్నాయో ఆ కిటికీ రెక్కలతో మన చేతులు కలిగించే అంతరాయానికి నిమ్నబిందువులవుతూ రాలిపోతాయి
ఫాల్ సీలింగ్ మొత్తం అలుముకున్న సాలీడు నక్షత్రాలు ఒక ఆకలినీ మరికొంత బాధనూ స్రవిస్తాయి
అప్పుడు మనం జవాబులు దొరకని బైరాగులుగా మిగులుతాం
నేను మాత్రం సగం కాలిన కాగితమే.

ఎన్నాళ్ళిలా...


కొన్ని నిరీక్షణలు అంతే ఎప్పటికీ వసివాడవు
పాలపలుకుల తియ్యదనం ఇంకా ఇప్పుడు ఆర్ద్రంగానే ఉంది
ఎందుకో తెలియదు రెండక్షరాల ఇష్టాన్ని ఓ చేత్తో మోస్తూ అమ్మా అంటూ 
ఇంకోవైపు తన మునివేళ్ళ ఖాళితనాన్ని ఎలా పూడ్చాలో తెలియని ఓ పసిచినుకు
ఆ శూన్యాన్ని అలా వదిలేసిన ఆ పదం కోసం నా(నుతూ)న్న కళ్ళలో ఎదురుచూపులను ఎలా నింపుకోవాలో నిజంగా ఇంకా తెలియనేలేదు
మొక్కలన్నీ పక్క పక్కగా
పూవులన్నీ వాటి కంటి దీపాలవడం చూస్తున్న అల్లరి నవ్వు పూయడం లేదు
పాకుతున్న ఆ తేనెపువ్వు ఎవరి వళ్ళో కేరింతలు కొట్టాలో అర్థం కాని బెంగ
ఆచ్ తీసుకుని వెళ్ళే చేతులు ఎప్పుడొస్తాయో అని కళ్ళను,కాళ్ళను ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందర ఎత్తి చూసే చిట్టి హృదయం
ఆకాశాన్ని భుజాల మీదుగా చూపే ఉప్పుమూట అమ్మే అయినప్పుడు
చందమామ తేవడానికెళ్ళాడని నమ్మే ఆ వెండినవ్వు
ఇంకా ఆత్రంగా
ఆర్ద్రంగా తెలియని మనసు తడిలో వెక్కి వెక్కి యేడుస్తూనే