Tuesday, May 27, 2014

నల్ల అద్దం

ఎక్కడికో విసిరివేయబడతాను కొన్నిసార్లు నాకు నేనె దూరంగా
అప్పుడక్కడ విరిగిపడిన శిలాశఖలాలలు కళ్ళ అంచులతో ఏరుకుంటాను

వాకిలి ముందు నేలపగుళ్ళపై జల్లిన కళ్ళాపి లేపనంలా
మది గుహలన్నీ పచ్చిగానే నానుతూంటాయి

అంతరంగ వైశాల్యాన్నీ కొలిచే కొత్త బావుటాలకు లోలోపలే చేదవేస్తూ
పాకుడు గోడలపై గొంగళిపురుగులా మరో వేట

నాలో రంగులద్దుకున్న ఎండు వారధులు
వాటి పునాదుల  మధ్యగా మళ్ళీ నేనె

చిట్లిన ఉప్పు నీటికి అతుకులేస్తూ  కలల సాంద్రతను వడగొడుతూ ఇంకో అన్వేషణ
ఇనుప గడియారంలో నిర్లిప్త శత్రువులు నా ఆప్తులు

మరికొన్ని అణువులు పేర్చుకోవాలి తెగిపడకుండా
ఇక్కడి నేలంతా ఎన్నిసార్లు నన్ను రాసిందో  విరిగిన ప్రతిసారీ

కొంత సాంత్వన ముసురు దుప్పట్లన తడిసిన చంద్రుడి సాలేగూటిలా
నన్నెవరో పోగేయ్యాలి మళ్ళా లోతునుండి బయటికొచ్చాక

No comments:

Post a Comment