Tuesday, January 27, 2015

సిరా...



ఒక్కో అక్షరాన్ని ఇలానేగా మనసులో తడిపి రాసాం
కలాల కొవ్వుత్తులన్నీ తలపుల తలుపులపై వెలిగిస్తూనే ఉన్నాం
నరుక్కున్న చేతులు కనబడ్డా
రాత్రి పిట్టగోడ మీద ఒక పావురాయి 
కీచు కీచుమనే శబ్దం
శరీరము వింటుంది
నిండుగా పులుముకున్న చీకటి
నక్షత్రాలు పచ్చి పుళ్ళయి వంటి నిండా పాముపుకుపోయిన తురాయి
ఈ రాత్రి గడవనీ ఒక్కో జ్ఞాపకాన్నీ
అల్లుకుందామనే భరోసా
అస్తవ్యస్త కలలు ఒరుసుకున్న రెప్పల ఆకులు నిత్యం చూసే ఆకుపచ్చ బాల్కనీ
రెండే అడుగులు పక్క పక్కగా
ముందూ వెనుకా మమేకం
చువ్వల కిటికీలు నాలోంచి నన్ను భయటపడేయడం
వింతగా మాటలు
మెట్ల గుండా పైకొస్తున్న కుక్కపిల్ల
చరుచుకున్న జీవాలమై ఇద్దరం
అచేతన దృశ్యమై అల్లుకోవడం
ఎదురెదురు కంచాలలో ముద్దలు
కొన్ని ప్రేమలు కడుతూ
రాసిన సిరా చుక్క

వెన్నెల మట్టి

రాత్రులకు కలల కెమెరాలను తగిలున్చుకుని కొన్ని నక్షత్రాలను ముద్రించుకుందాం రా
వెన్నెలనంతా సముద్రపు ఒడ్డున పోసి బేరం పెడదామా తీరపు కెరటాలకు?
మన మనసులివిగో అంటూ పాకుడు హృదయాలను హత్తుకుపోదాం
ఇంకా ఇంకా
ఏదోరకంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి మంచు ఇళ్ళ కబ్జాకు
నువ్వూ నేనూ ఉండాలిగా
ప్రేమను వండే ఓ పాత్రా
మరియు ఇంకాసిని మనసు రేణువులనూ గురుత్వచలనం లేకుండా కట్టేద్దాం
తుమ్మెద దీపాలం
అడవి పువ్వులం
మూగ జీవాల ప్రేమలం
అంతే మనం

నీళ్ళపువ్వు....


ఎన్నిసార్లు ఈ తలుపులు పగలగొట్టినా ఓ వెగటు వాసన నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది
కురుస్తున్న వర్షానికి ప్రతీక అయిన ఈ మురికి మోరీకి నా ప్రాణం కొత్త కాదు
నీటిపువ్వులు నాలో నాకై జ్వలిమ్పబడే స్వర్ణరేకులు
అగ్గిపుల్లల వింత చప్పుడూ 
ఒక పిల్లవాడి మూతి వెలుగూ ఎప్పుడూ బాగుంటాయి నాకు
లోపలున్న ఎలుకల మందిరాలే పెద్దగా ఇప్పుడు నచ్చడం లేదేంటో
పరాయి తాబేలు గుహా
దాని ముసురు నడకా ఇంకా
ఎప్పటికీ నా తలతో ముద్దాడని ఊహానూ
ఇదింతే ఎప్పుడూ
వెన్నెలను మింగే వానపామే
నాకు మిగలదు
నెత్తి మీద పచ్చి ఆకాశం
నేను కట్టుకునే మైనపు గుడారం
ఏంటో ఈ వేశ్యాదేవతల కన్నీరు నా గుండెల్లో ఒకానొక ఇంకుతున్న దాహపు తడి
కక్షలో విదిలించిన జీవి తాలూకు ఆనవాళ్లు
కదిలించు
చలించు
చాలించు
గుండె రెక్కలను కరిగించిన పూత
మెదళ్ళ ఖార్కానాలో
సత్తులో కట్టలేని మెతుకులనెత్తాలి
శరం తరం మిగలాలి
నిస్సత్తువ మారిపోయిన వాసన
నా వెనకాల

Wednesday, January 21, 2015

Undefined

ఇంత దూరం ఇలా వచ్చేసాక 
మళ్లీ చూస్తాను నీకోసం
ముందుకో వెనుకకో
నువ్వక్కడే నిలబడిపోయిన శబ్దం

సమీర దారులన్నీ మనిద్దరమే కలిసి అల్లిన ఆ డిలైట్ఫుల్ క్షణాలకు సంజాయిషీ ఎలా చెప్పాలి
ఆత్మలను అలా అలా కౌగిలించుకు తిరిగేసి ఇప్పుడీ మూకుమ్మడి శూన్యాన్ని ఒక్కడినే ఎలా సేవించడం

ఆకులూ వాడిపోతాయి
పువ్వులూ మసకేస్తాయి
మన చేతులతో కట్టిన మట్టిగూళ్ళు మాత్రం అలా ఓ ఖాళీని మోస్తున్నాయి
పదాల స్పర్శ మనకలవాటే
రాత్రుళ్ళు కాగితాలతో రమించడం మనకు మాత్రమే తెలుసేమో

అక్కడక్కడా విసిబుల్ కాఫిన్స్
నేను కొన్నవి ఒక్కడినే దులపడం కష్టంగా మారిందిప్పుడు
కాస్త నీ సాయం కావాలి
మోస్తూ మోస్తూ ఎలా విడిచేయడం

అంతరంగాల అర్థం
మనసు నిఘంటువుల నిండా వెతికినా దొరకలేదు
ఒక్క నీలో తప్ప

సరే రా
ఇలా వెలిగిద్దాం
ఓ మంచు లాంతరును
గోడల మీద తగిలిస్తూ

కొత్తరోజు....


ఈరోజంతా ఒకటే సందడి
నా కిటికీ రెక్కల గుండా లోపలికొచ్చిన 
వెలుతురుపిట్టలతోనే మనసంతా నిండిపోయి

విశ్వరహస్యాన్ని గుప్పిట్లో తెలిసినట్టు 
ఒక తత్వమేథం ఇలా రంగుల పిచ్చుకై నాలోంచి దూసుకెళ్ళి దులిపిన బూడిద కల్లాపి

ఇలా పూలదివిటీలన్నీ ఇంటి ముందంతా మెరుస్తున్న కాపరులై నన్ను నిందిస్తూ
చీకటి పట్టిన చెరువు చలిగాలికి తాళలేక కదులుతూనే ఉంది ఇంకా,
గాలి చేతులుపుతూ పిలుస్తున్న గుర్తు

పరుచుకున్న ఆకాశమంతా మొండిగా
మసకేస్తోంది ఇంకోసారి
దోసిలి పట్టినా ఇలా పాకేసింది భూమంతా

నేను మాత్రం ఇలా నా గదినిప్పుడు మళ్ళా కడుక్కుంటూ నా ఆత్మ నా దేహంతో.

Monday, January 5, 2015

నే(ను)వ్వు



అద్భుతాలు కురుస్తాయటగా అప్పుడప్పుడు
అవును నువ్వూ నేనూ
ఓ అద్భుతమే
ప్రపంచంలో
ఓ చోట
తెరుచుకున్న
ఆకాశం మనిద్దరిదీ
ఈ పూట
కాలానికి
గంతలు కట్టే
పసి అమాయకులం
కదా అలానే ఉంటాం
ఇష్టాల
గుప్పిట
ఇప్పుడిప్పుడే
గడ్డకడుతున్న
మనసు
చమురు వీధుల్లో
శిలాశాసనమై
నడిరాత్రి
నక్షత్రాల
తొక్కిసలాట చూస్తూ
మన చప్పట్లు
వెన్నెల వీపును
చరుస్తూ
క్షణాల
ఇంకిపోత
సాగిపోతున్న
సమయపు నావలో
వెన్నెల గూళ్ళు
ఇంకా కడదాం
తెల్లారేదాకా
మేడ మెట్ల మీద
కుక్క పిల్లల్లా
వినీల
కరచాలనం
మనం
సదా