Saturday, August 30, 2014

సగం వాన

ఒక చూపు మొక్కయి కప్పుకున్న ముసురు వంక తల ఎత్తి పైకి విసరడం
తడిసిన తలను విదిలిస్తూ మూలుగుతున్న కుక్కపిల్ల
నా పై తన ప్రేమనంతా జల్లుతూ
కాళ్ళను ఎంగిలి చేయడం
అంత ఇష్టంగా మనసారా నవ్వడం తనకు మాత్రమే తెలుసేమో

చుట్టూతా కరివేపాకుల సుగంధం
తడిసి తడిసి చిక్కబడ్డ ఎర్రమన్నుకొత్త అనుభూతినేదో మిగులుస్తూ

నాపై పడగ విప్పిన జీవమొకటి నాకేసి చూస్తూ నీలంగా
కళ్ళను అప్పడిగాను ఆ క్షణం స్వచ్చంగా

సగం తెరిచిన కిటికీ
కొంత గాలిని చీలుస్తూ నన్నూ కోస్తూ
లోపలున్న గుండెనాడిస్తూ

నువ్వూ నేనూ ఒకటేలా
బోరుమన్న సముద్రం
పడుతూ లేస్తూ

ఇప్పుడు పూర్తిగా తడుస్తూ
నన్ను  విదిలిస్తూ

Wednesday, August 27, 2014

దీపం అంచు

కొన్ని దీపాలు వెలుగుతుంటాయి ఎడారిలో పోసిన ఇసుకలా
అవి నీలోకి నాలోకి చేరుతుంటాయి కంటి రేణువులుగా
రాత్రి ఎప్పుడో తగలబడ్డ చీకటికి జరిపే అంత్యక్రియల్లో ఇంకుతున్న చమురు చిమ్నీల్లా 
రెప్పలూపుతూ నిలబడ్డ ఒక చెట్టు తనను శిశిరంలో నరుకున్నప్పుడల్లా

ఇక అప్పుడు నేను నడుస్తున్న దారెంట నిటారైన స్తంభాలపై వేలాడుతున్న కరెంటు దండెంపై తమను ఆరేసుకున్న కాకుల పార్థివాలు నా ముందు పడ్డప్పుడు చూస్తాను ఒకసారి అన్నిపక్కలకీ
ఎవరు విసిరేసారా ఈ వెలుగును అని

చెర్లో తోడే చేదబొక్కెనలో ఊగుతున్న నీళ్ళు తళుక్కుమన్న శబ్దంలో కనబడ్డ ప్రశ్నార్థకాలు
చెరోపక్కకీ దూకిన ప్రతిసారీ కొన్ని కిటికీలు తెరుచుకుంటాయి కళ్ళ రెక్కలుగా
గదిలో వలయాలుగా తిరుగుతున్న గాలి ఉన్నట్టుండి ఆగి పడుతుంది నా పక్కనెక్కడో

కులాసాగా ఒక పలకరింపు బయట నన్ను ఆరేసుకున్నప్పుడల్లా మెరవడం బాగుంటుంది
విరిగిన అగ్గిపుల్ల నెత్తిమీద పెట్టుకుని నవ్వినట్టు
ఏ క్షణమో నువ్వూ నేను రాలిపోతాం భారరహితంగా
ఆ లోయలో పూల వాసన ప్రతిచోటా పెల్లుబుకుతూ తిరుగుతుంది
ఇంకొన్ని దీపాలు మట్టిపైన కూర్చుంటాయి తాపీగా.

కాస్తంత


కాస్తంత వెలితి ఉండడం సహజమేనేమో చెట్ల ఆకుల మధ్య ఖాళీల్లా
అవి రాలి పడే ఒక చోటులా
నువ్వు నేను ఉన్నప్పుడు కూడా ఈ వెలితి గడ్డకట్టుకునే ఉంది
ఎన్నిమార్లు నిశ్శబ్దాలు బద్దలయినా   ఏమి తెలియనట్టు ఉంటాం నువ్వు ఆ పక్కన
నేను ఇంకో పక్కన
ఏంటి ఈవేళ కొత్తగా ఉన్నావ్?
నేనా...
హా నువ్వే?

నీకెందుకలా అనిపించింది?
ఏదో మార్పు కనబడింది ఈరోజు నీలో అందుకే అడిగా

you asshole..
ఏంటి అంత మాటన్నావు?
మరి కాదా..
you licked me
teared me
what else you have not done

తల పగిలిన కాంతి ఎర్రగా
ఏమైంది నాకు
తేడా ఏమిటి నాలో

మళ్ళా తనే
ఎన్నిసార్లు తలవంచలేదు నువ్వు నా ముందు
ఎప్పుడు?
నా తొడల మధ్య నిన్ను నేను దాచుకున్న ప్రతిసారీనూ...
అది మోహం
హహహహః....బిగ్గరగా ఒక నవ్వు
ఎందుకంత నవ్వు
మోహం అంటేనూ...
ప్రేమలేని మోహం కూడానా

you have stabbed
brutality..
you fucker
fuck off
you fucked my heart
fucked me off

మళ్ళీ నన్ను నేను వెతుక్కోవడం
ఏమైంది తనకు ఇన్నాళ్ళు చెప్పలేదే ఇంత భావంగా
ఇప్పుడు ముభావంగా

అదేంటి ఇష్టంగానేగా మనసులను మెలేసుకున్నాం
కన్నీళ్లను కూడా ఒంపుకున్నాం..

ఏవో వినబడుతూ..
మైదానంలో నీ కోరిక పగిలినప్పుడల్లా ఆరని రక్తపు చారలు నా కళ్ళలో నీకెలా కనబడతాయి?
నా పెదవులు పెగలడం మానేసాయి ఇంక

రా అంటూ
నాలో కలిసిపోయింది
ఒక సంతృప్తి నాలో
తనలో.....?
ఇప్పుడు వెలితి తెలిసినట్టు నేను.

Sunday, August 24, 2014

kuch bhi nahi

కొన్ని అంతే ఎప్పటికీ అర్థం కావు
ఎప్పుడో మళ్ళా చూసుకుంటాం ఏంటా అని
ఇంతకు మునుపు చూసామా లేక కళ్ళకు ఇప్పుడే ఎదురుపడ్డాయా అని అనుకుంటాం
నిద్రను కాజేసిన రాత్రిని తాగినప్పుడో
నన్ను నేను తవ్వుకున్నప్పుడో గుర్తుకొస్తుంటాయి
అంతకు ముందెప్పుడో మెట్ల కింద దాక్కున్న చెప్పులు నా కాళ్ళకు అతుక్కోవడం
వడివడిగా దారి వెతుక్కోవడం కొత్తేమి కాదుగా నాకు
అక్కడెక్కడో గమ్యాలను కుప్పపోసారంట కొన్నైనా ఆలోచనల్లో నింపుకుందామని లేచి నిలబడతాను బద్దకంలో కూలబడకుండా
అలమరాలో దుమ్ము పట్టిన పాత పుస్తకాల వాసనా నాలోకి ఇంకీ ఇంకకుండా మనసుపొరలను బాదిస్తుండడం బాగుంటుంది ఒక్కోసారి
నువ్వొస్తావు ఎప్పుడోకసారి మాటలతో ఊడ్చేస్తుంటావు
సరుకులూ ఇల్లూ భుజానికి వేలాడుతూ
నవ్వు కూడా అలాగే మరణిస్తుంటుంది పెదాలు మూతపడ్డప్పుడల్లా
మట్టి రోడ్డు నాకంటే ముందు పరిగెడుతూ మెలికలు పోతోంది ఎక్కడికో పారిపోదామని
నాకెప్పుడూ ఇష్టమే తనంటే నాతోనే  నడుస్తుంటుంటుంది కాళ్ళకు చుట్టుకుని
ఇప్పటికీ అర్థం కావు కొన్ని నాకు పళ్ళికిలిస్తూ నిఘంటువున్నా 

Saturday, August 23, 2014

పూర్తికాని సంభాషణ

సగం తెగిన మాటలు నీలో నాలో ఉండేవేగా ఎప్పుడూ
భావాలు వేరంతే
నేను తీరిగ్గా ఉన్నప్పుడు నువ్వకడికొచ్చి కొంత ఖాళీని పూడుస్తావు
కాస్తంత తడి చేస్తావు ఓపిగ్గా
ఇంటిముందు నిలబడ్డ పూలూ నవ్వుతాయి మళ్ళీ అప్పుడు
ఇప్పుడు కొన్ని మౌనాలను మిగుల్చుకున్నాం అంతేగా
చాలా కాలమైంది మాటలు పంచుకుని
ఏ అర్థరాత్రో తెరలు తెరలుగా కళ్ళ మీదకొస్తావు
మనమిద్దరం ఎదురెదురుగా కూర్చుంటాం అచ్చూ గాలినింపిన కంచాల్లా
నువ్వు నన్ను చూడ్డం నేను నిన్ను చూడ్డం
మళ్ళా కాస్త కొత్తదనం
మనలో కాదు
మనల్ని అక్కడ ఉంచిన సమయాల్లో
అప్పుడు వేళ్ళన్నీ గోడ మీద పాకే బల్లులే అవుతాయి దూరంగా ఉండి తాకలేక
ఇక అప్పుడు మొదలెడతాం బాగోగులు
ఏంటి ఈమధ్య కనబడడమే లేదు
...ఉన్నానుగా  ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ

ఫక్కున నవ్వు నీలో
...ఏమైంది అబద్దాన్ని ఏం పాతలేదే నేను

ఎదురుచూడ్డం అంటేనూ
ఇప్పుడెవరూ ఉండరు అలా ఇంకొకళ్ళ కోసం
...నే చెప్పేది నమ్మలేవులే
కొత్త గోడలు పాతబడాలి పగుళ్ళు తెలియాలంటే

సరే సరే నమ్ముతున్నానులే చెప్పు
...బోళ్ళు ఉన్నాయి బుర్రలో నీదగ్గరికొచ్చేప్పుడు
ఇప్పుడు గుర్తుకు రావడంలేదు

ప్రేముంటే ఏమీ మరచిపోవు..
నన్ను పడదోసిన నీ మాటలు
....ఆ ప్రేమలో ఇవన్నీ మునిగిపోయాయి నమ్మవే చెబుతుంటే

ఆపు దగ్గరకి రా ఇలా
..రాయి "లా"
అవును నేనదేగా
పూర్తవ్వని సంభాషణ మనది 

Friday, August 22, 2014

హ్మ్ జిందగీ

నువ్వెవరో తెలియదు నీకప్పుడు
కరడుగట్టి నీ శరీరాన్ని కోస్తున్న చలి 
ముఖం మీద కనబడే జీర 
కళ్ళు పగిలినట్టు అనుభవమయ్యే క్షణం 
ఒట్టిచేతులు శూన్యం తప్ప ఏమిలేదు వాటి మధ్యన 
వణుకు నీకు తోడుగా పక్కన కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటుంది
అప్పుడు నిన్ను నరికిన శబ్దం వినబడీ వినబడకుండా
నిన్ను నువ్వు పైకెగరేసుకుందామని చూస్తావు 
మళ్ళీ ఒక ఆలోచన వెన్నులో గడ్డకట్టి 
తోస్తూ లాగుతూ 
బిగ్గరగా పేలాలని అంతర్మథనం
పీలికలుగా కనిపించడం బాగుంటుంది ఒక్కోసారి
నాలుకలు వేర్లలా నోట్లో పాతుకుపోవడం కొత్తేమి కాదు
ఇవ్వాళో రేపో అంతే
గదంతా చీకటి వాసన చుట్టేసినప్పుడు నిన్ను పూరించే మాటలకోసం వెతుక్కుంటావు చూడు గదంత మనసేసుకుని ఒక్కటీ అవగతమవ్వదు
ఇక అప్పుడు ఇంకో మరణం నీకు పోటిగా
ఉండిపో అలానే

Thursday, August 21, 2014

రాత్రి ప్రసవం


రాత్రి ఒక ఒంటరి వాన
ఉదయం ఒళ్ళు విదిలిస్తూ కనకాంబరాలు 
వాటి నుండి జల్లులా కొన్ని నీటి చుక్కలు
తన్మయంలో నేల మట్టివాసనగొడుతూ
చిక్కగా నానిన ఎర్రమట్టి ముక్కుల్లో కూర్చుంటూ
బాల్కనిలో ఊగుతున్న ఆకులు
కుండీల్లో ముడుచుకున్న పాపాయి ఉదయం సాయంత్రం చేతులుపుతూ పచ్చని పరిమళం 
ఏంతోచని కుక్కనలుసు నా కళ్ళల్లో బయటకొచ్చినప్పుడల్లా తోకాడిస్తూ వీధి చివర 
పాపం ఎవరూ దుప్పటి కప్పినట్టు లేదు చలిని కావలించుకుంది
నన్ను చూసి కళ్ళతో ఒక నవ్వు గుండెల్లో విరిగిన పాలలా
జివ్వున రువ్విన తల
చుట్టూతా జల్లు
కొన్ని పిచ్చుకలు బద్దకంగా నోరు తెరుస్తూ రెక్కల టపటపా
కొత్తగాలి జననం ఇంటినిండా నిండిన ప్రసవం 
ఉమ్మెత్తల పలకరింపు కుశలమా అంటూ వచ్చేపోయే ఆత్మీయులకు
ఒక అలవాటు అందంగా 
నన్ను నేను చూపిస్తూ ఇంకోసారి
ఇప్పుడంతా ఆరిన గుర్తులు మళ్ళీ తడవాలి ఏ రాత్రో

Tuesday, August 19, 2014

ఇంకో నేను

నేను నేను కాదు అప్పుడప్పుడూ
రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని
అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని

అసంకల్పితంగా 
రాలే ఋతువులు 
నాలో కొన్ని 
నిర్లిప్తాలో
నిస్సంకోచాలో
గోడ మీద అందంగా పేర్చబడ్డ సగం పగిలిన ఆత్మలో
గుర్తులేదు కానీ ఇంకా ఎన్నింటినో 
వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు
ఆత్మహత్యకు తయారవుతూ

మునుపో
నేడో
ఎప్పుడో
నిశ్శబ్దం నవ్వులో నుండి
పదాలన్ని వెచ్చని పందిర్లుగా 
తెరిచి మూసిన తలుపులు
ఒరుచుకున్న ఆకాశపు మట్టి
భావాలు ఇంకొన్ని
కళ్ళనూ
కడుపునూ కన్నీళ్ళతో కుట్లేస్తూ
పగలో ఆకలి పొట్లం
ఇప్పుడు మళ్ళా నేను కాదు
మధ్యాహ్నం కడుకున్న ఎంగిలిని
కూసింత ఎర్రటి ముసురు
ఒక నిద్ర
మరో మెలకువ
రెండూ నాలోనే
నాతోనే

రాళ్లు పడ్డ పదార్థం
తరంగాలుగా పగులుతూ
నన్ను గుర్తుచేస్తూ
మనిషి నిక్షేపాలు
చెరిగిన చెమ్మ అంచు అంచుపై నిలబడుతూ
నన్ను నేను శోదిస్తూ

Saturday, August 16, 2014

నేను ఇంకో రాత్రి


వాకిట్లో
వెలుతురు
చీకటి చుట్టూ అల్లిన రాత్రి

కంట్లో
ఒంట్లో
ఒక నిద్దుర
మగతగా

ఎప్పుడో బయట పడ్డ కిటికీ చూపులు కిర్రున
చెవుల పక్కగా వెళుతూ
దుప్పటి కప్పిన ఒక ఆత్మ
నల్లగా నవ్వుతూ

వేళ్ళు
పంచుకుంటున్న చలి
కొన్ని కొంకర్లు

ఓ పక్క ముసురుగా వాన
ఎప్పటి నుండి వచ్చిందో గదికి ఆవల
నన్ను తడుముదామని చూస్తూ
బావురుమన్న ఆకాశం అంతకు ముందు

కళ్ళ చిత్రాలు ఆరోజు
కాగితం కల
నిన్ను గీస్తూ
నన్ను కలుపుతూ

తెల్లార్లు తోపులాట
గాలి పువ్వులు
ఒకదాని వెంట మరోటి

ఉదయం
రాలిన పిచ్చుకలు
నూకల కుచ్చిళ్ళను నెమరుతూ
నే
లేచేసరికి

ఇదిగో తీసుకో
ఈ క్రాంతి
కాంతి
సూరన్న పలకరింపు

Wednesday, August 13, 2014

ఖాళీ సీసా

కొన్నాళ్లుగా ఇక్కడే పడుకుని ఉన్నాను
నా పైన సముద్రాన్ని కప్పుకుని
లేచి బయటకొచ్చి కూర్చుంటాను స్తబ్ధుగా
ఒక్కసారిగా తన చేతులు కెరటాల్లా కప్పేస్తాయి

ఎవరు చెప్పారు నీళ్ళకి రంగులేదని
ఆకాశం ఒక్క ఉదుటున దూకి పడ్డప్పుడు తనలో కరిగిన నీలం రంగు కదా
పాలస్తీనా పసికందుల తలలు పగిలినప్పుడు చూడలేదా ఎర్రరంగును వారి కళ్ళలో
గాజా మొత్తం తడారిపోలేదా ఆ ఆక్రందనలతో
ఇప్పుడు విను ఆ నొప్పి కన్న ఒక ఉదయాన్ని
నీ ఆలోచనలకు పూసుకో ఆ వర్ణాన్ని

ఒక వినోదం నీకు కనిపిస్తుంది స్పందనకు నీళ్ళొదిలినప్పుడు
రాజరికానికి బానిసైన కొన్ని ఆత్మలను వాసన చూసావా ఎప్పుడన్నా
ఇంకో
ఘటన
సంఘటన
కాస్త క్యూరియాసిటి
పొద్దున్నే పేపర్లో నిన్ను నువ్వు జొప్పుకుని కొన్ని వార్తలను జేబులో వేసుకుని వెళతావు
రోజంతా సరిపడేన్ని
ప్రమాదం
కాఫీతో కాలయాపన
నాలికపై
నరాల్లో ఏం మిగిలింది

మరికొన్ని చూస్తావు
చదువుతావు
అక్కడెక్కడోలే
సాయంత్రం సినిమా
తంత్రి
భావోద్వేగం
కృత్రిమం
చలికాలపు పువ్వులు తొక్కబడ్డ కాళ్ళు
వాటి గుర్తులు
భూమి స్తన్యంపై

శీతాకాలం
ముఖానికి అడ్డుకున్న మంచు
తుడిచేస్తూ పూర్తిగా
గుండెను కదిలించని ఆవేదనలు
దేకుతున్న పిల్లలు
చూపులు బిగబట్టి
మళ్ళా కాసేపు

బయట వేసిన ఖాళీ మంచం అద్దుకున్న శూన్యపు రంగు
ఇంకొంత నైరాశ్యం
మరికొంత వైరాగ్యం
అంతేగా ఇంకేం చేయలేవు పాచి అన్నంలో చేతివేళ్ళ దేవులాట
నువ్వు పారేసిన అధికం
కడుపులన్నీ శిలాజాలుగా
కిటికీ రెక్కలకు వేలాడుతూ
ప్రాణం మట్టిరంగేసుకుంటూ
లోపలకెళ్ళి శాశ్వత నిద్రను ముసుగేసుకుంటూ

Sunday, August 10, 2014

స్థిర

స్థిర
_____
కొన్ని నీటిచుక్కలు మొలుస్తాయి నా వేళ్ళ చివర
వాటిని ముట్టుకున్నప్పుడల్లా
ఎవరో నా మునులపై నాటి  వెళ్ళిన శబ్దం
అప్పుడప్పుడు గుండెచలమల్లో కూడా కనిపిస్తుంటాయి అచ్చుపోసిన  యంత్రమల్లె
నల్లరేగడి అంగట్లో ఇవి నడుస్తుంటాయి చూడు
కడుపారా ఆలింగనం అంటే అదేనేమో

కొన్నిసార్లు 
కళ్ళవుతాయి 
కన్నీళ్ళవుతాయి 
మాటలవుతాయి 
మాటలు కడగని భావాలవుతాయి

ఇవాళ ఇక్కడ ఇంటి ముందరి ఆకులపై శిశివులయ్యాయి
ఏంచేద్దాం మెల్లగా పాకుతూ నేల ఉయ్యాల్లోనూ కనురెప్పల కిందానూ 
మనసు గది కడిగినప్పుడల్లా చిక్కని ధూళితో మమేకమవుతాయి చెమట పన్నీరుగా
ఆలోచనల్లో గడ్డకట్టి ఘనీభవిస్తూ మళ్ళా మళ్ళా మెదడు గూళ్ళలో పడిలేవని శవాలు

అద్దం ముందు నిలుచున్నప్పుడల్లా నా ఎదురుగా జారుతుంటాయి రెండుగా 
పరావర్తన శకలాలుగా
రాత్రంతా కనబడకుండా పొద్దున్నే పోగొట్టుకున్న మంచుముద్దలుగా కాళ్ళ కింద కూర్చుంటూ
గుచ్చే పసిసూదులు ఇవే

పాళీ కదిపినప్పుడల్లా అక్షరాల మధ్యంతా జారిపడే గుర్తులు
మూసిన కవనంలో తెరిచి ఉంచిన జ్ఞాపకలవుతాయి
నిన్నూ నన్నూ నడిపించే ఆత్మలు
కొన్నాళ్ళుగా నుదురుని మెలివేసిన అనిశ్చిత కంకెలుగా రాలుతూ 
నాలో అస్థిర నివాసం

Friday, August 8, 2014

స్వ దేశభక్తి

అక్కడెక్కడో రెపరెపలు
తలయెత్తి దొంగచూపులు గుచ్చుతూ
నుదుటిపై గర్వానికి సెల్యూట్
దోపిడీనంతా దోసిళ్ళలో నింపుకుని వెదజల్లే రక్తకుసుమాలు
పుస్తకాల్లో రాసుకున్న దేశభక్తి
చేతల్లో కాలిన బూడిద
కళ్ళల్లో నిండిపోయిన స్వార్థపు గదులను కడగడానికి ఇష్టపడని దేహం దేశ ప్రక్షాళన చేపట్టే విడ్డూరం
నిన్ను పట్టిన తుప్పుపై రంగులేసుకుంటూ త్రివర్ణ పతకానికి అబద్దాలు చెబుతూ లిఖించిన చరిత్రలన్నీ
పదవులుగా పరిణామం చెందాలిగా
ఎన్ని శవాల కంపో నీకు పడదుగా వాళ్ళ రుధిరపు ఫలితమైతే కావాలి
జనగణమణ నాలుకపై పలుకని నిర్భాగ్యపు ఆత్మలు వెదురు వీర్యంలోనుండి పనికి రాకుండా వెదజల్లినప్పటి గుర్తులు ఇంకా ఇక్కడే ఇలాగే
శుభాకాంక్షలు...కొన్ని స్మృతులు అంతే మళ్ళా 

Thursday, August 7, 2014

A Complete Vauum

కిటికీ చువ్వల మధ్యన ఒక మెడ 
బయటకు లోపలికి కదలకుండా 
నిర్వచనాలు మాత్రం చాలానే రెక్కలకు వేలాడుతూ 

చెవుల విసినికర్రలు కాగితపు కొమ్మలు 
నిర్వీర్యమవుతున్నకొంత గాలి 
అద్దంలో పళ్ళు చూసుకుంటూ చంటాడు
అమ్మ చెంగు సముద్రం 
ఓ పిడికిలి ధైర్యం 

కుంపటిలో ఎర్రరంగు కణికలు
వెలుపల పండుకళ్ళలో ఉడుకుతున్న ఎసరు 
పాత్రలో ఒలికిన అమృతం 
నాలుక నదిగా పరివర్తనం

ఇంక గట్టు కింద కాళ్ళు పెనవేసుకున్న నల్లరేగడి పువ్వు
వ్యాపించిన సుగంధం మనసువీధి గుండా పొర్లుతూ
పొద్దున్నే నుసులయ్యే కలలు 

వాకిట్లో పారబోసిన సూర్యుడి తుమ్ములు 
కల్లాపిలో వెలుగుతున్న పసిబంతులు 
ఒక కేక సుదూరంగా సాయంకాలం అస్తమయమవుతూ 
వెళ్లనని మారం చేస్తున్న సమయం 

నిశ్చలంగా కిటికీ తలుపుల మూత
చువ్వల మధ్యన ఖాళీ ఇంకోసారి

Wednesday, August 6, 2014

మట్టిపురుగు

అక్కడొక వృక్షం
ఇప్పుడు పడుకుని
చేతులు కాళ్ళు ఎవరో కొట్టుకు పోయారు

భుజం మీద తన గుర్తులు
చెరపలేని పుట్టుమచ్చలు
మట్టి తవ్విన శబ్దం
చెవుల్లో గిరిగీలు తిరుగుతూ

దోసిట్లో కొన్ని నీళ్ళు
ఎవరో పోసినట్టు
పొత్తికడుపు అదిమిన ఆత్మీయ స్పర్శ
కళ్ళముఖంలో చెమ్మ
కాండం మీద కూర్చున్న పిచ్చుక పిల్లలు
రెప్పలను గాలితో కడుక్కునే దృశ్యం

నడుస్తూ తోటప్రేమ
చుట్టూ చుట్టుకున్న పాముల వేర్లు
అందమైన మట్టి పురుగులు
పెదాలపై పాకుతూ
నీకొక అనుభూతి చూసిన ప్రతిసారి
మిగిలిన నల్లసున్నం

ఆకులదీపాలు పచ్చగా మెరుస్తూ
హత్తుకునే ఉదయాలు
బాధను జీర్ణం చేసుకునే ఒక నవ్వు
చెక్కని ఒళ్ళు పేళ్ళుపేళ్ళుగా
అన్ని సమయాలు
తడిచేసే మనసు హస్తం
కొన్నిసార్లు కళ్ళలో
ఇంకొన్నిసార్లు మనసు సమాధుల్లో

కడుపు నిండిన తృప్తి భూమిలో
ప్రసవం వాననీళ్ళు
ఓ విత్తనం మళ్ళా ఇప్పుడు తల తెరుస్తూ 

Tuesday, August 5, 2014

స్టార్చ్

నేనొక పిండిపదార్థం
కాలానికి వేలాడదీసిన నిర్లిప్తాన్ని
కొన్ని ఆమ్లాలను మరికొన్ని క్షారాలను గొంతులో పోసుకుంటున్న ద్రావణాన్ని
తటస్థికరణం చెందని అసంతృప్త ఆత్మ
తడి దర్పణాలు తలాడించే కన్నుల్లో చెమ్మలై
సాంద్రత తెలుపని మనసు ద్రావితం

డోలకమై నడిచే ఒకయంత్రం
డోలాయమానంలో ఒంటరి శ్మశానంతో దోస్తీ
రంగులేని వర్ణమొకటి లోనెక్కడో సంతరించుకున్న అరుణం
చిట్లుతూ మళ్ళా స్పటికం

మస్తిష్కంలో ముసురు పట్టిన వేదన
పాలపుంతలో స్రవిస్తున్న కన్నీళ్ళు
అటునుంచో ఇటునుంచో మొదలెట్టాలిగా నడక
జీనికేలియే సఫర్ తో హోగా
ఇంకో దారి తెలియాలి

కనిష్కంలో గరిష్టమైన జీవితం
జ్ఞాపకాలు సందెగిన్నెలో సూరీళ్ళు
ముద్దగా మారుతున్న ఇంకొక్క పరాన్నం

Saturday, August 2, 2014

అ|సంబద్ధం

ఈ గోడలిలానే అచ్చు మనలాగే నిలబడ్డాయి
ఎప్పటికీ కూలి పడని పావురాలు
ఇంకో వేర్పాటు మన మధ్యే

ప్రణాళికో
ప్రహేళికో
పాదాలకు సరిపడా చోటు

అద్దం
యుద్ధం
సంసిద్ధం
అసంబద్దం
ఎవ్వరికేం నరాలు ఇంకా ఏర్పడలేదు

ఓ ప్రక్కనెక్కడో తల
హిమాలయాల క్రింద నలిగి పడుతూ
ఆలోచనలు అగ్గిపుల్లలై నిలబడడం
కాలపు పిట్టగోడపై

మళ్ళా కక్షలో  దిగబడని శరీరం
గగనంలో తోకచుక్కలు
నాలుగు  మిణుగురులు
నా అడుగులు చీకట్లో వేస్తున్న నాట్లు
ముద్దగా తడి ఇంకుతూ

నిర్మాణాలన్నీ
హేతుబద్ధం
విభజన రేఖ అంతరాళంలో
నిలువునా కోస్తూ
నీకు నాకు మధ్య

నిర్మితం
నిస్సంకోచంగా
నిశ్శబ్దంగా
తొలుస్తూ తొలుగుతూ....

Friday, August 1, 2014

ro

గుప్పెడు మిగిలాయిప్పుడు
ఆశలు
బాసలు
కొండలు

రాత్రులను చుట్టుకుని ఒరుసుకుపోయే
పగళ్ళు
రంగు కొవ్వుత్తులు
నీళ్ళలో కరుగుతూ

                                                            ఇందాకెప్పుడో
                                                 పరిగెట్టిన గుర్తు కాలం వెనకాల
                                                 గతాలను వెలిగించుకుంటూ
                                                             నీ పక్కన
                                                         ఇంకో నిర్మాణం
                                                                 రణం    
                                                                 మరణం

                                                                                                            వర్తమానం
                                                                                                 నాక్కొత్తగా  కనబడడం
                                                                                                 తెలియని తేనె శంఖం
                                                                                                 పూరిస్తూ
                                                                                                 ఊస్తూ
                                                                                                 ఊరిస్తూ
                                                                                                 అస్తిత్వం