Thursday, November 6, 2014

అద్దాలం

కొన్నిసార్లు అద్దాలమవుతాం మనం
వీపులు ఆనించిన దర్పణాల గుండా ప్రసరించలేము అంతే పూర్తిగా
పత్రహరితం అంటిన ముఖాలుగా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి
మంచులా కరగడం మళ్ళా ముడుచుకుపోవడం మామూలే
గదులు మాత్రం కడుగుతాం ప్రతిరోజూ
మనసునింకా కడగలేకపోయాంగా
ఎప్పుడో ఏర్పడ్డ పగుళ్ళు ఇప్పుడెలా మానిపోతాయి నువ్వొచ్చావని
వసంతంలా మారే సమాధులం అసలు కాలేము కాలానికి వేలాడే దూలాలమ్
అర్ధం కాము తిరగేసి చదువుకునే దాకా
కుండీలలో అందమైన పేడ పురుగులకు గొడుగులవడం అంత సులభమేమీ కాదుగా
చేతుల ఆకులవ్వాలి
చుట్టుకోని వేర్లవ్వాలి
ఒక తడికౌగిలవ్వాలి
అంతే ఇంకేం అవసరం
మసగ్గా మాట్లాడుకునే మాటలన్నీ ఇప్పుడు తెగిన తాబేళ్ల నడకలు
నేర్చుకుందాం ఇంకోసారి తడవడం
తనువులను తగలేసే ప్రక్రియకు అంత్యక్రియలు చేయలేని శవాలమేగా ప్రతిరోజూ
నన్నలా  ఉంచేసిన ఖాళీతనం మెదడంతా మచ్చిక కాని ఆలోచనలు
గాలిలో ఊగే ఎండిన పూల దేహాలు నాకిష్టం గుమ్మాన్ని పట్టుకునే ఉంటాయి నువ్వొద్దన్నా
ఓ రాత్రి కావాలి ఇప్పుడు నల్లగా నవ్వడానికి
పగలంతా పళ్ళు కట్టుకోవడానికే ఈ శ్రమంతా
ఈసారి  ప్రసరిద్దాం ముందు జాగ్రత్త చర్యలో ముగిసిపోకుండా

No comments:

Post a Comment