Tuesday, November 11, 2014

మళ్ళీ


ఇంకోసారి కొత్తగా మొదలెడతాం మళ్ళా  ఆగిపోయిన చోటి నుండే
నా నుండో నీ నుండో కొన్ని పదాలు పుడతాయి
మన చేతులకు పని చెబుతాయి
పసి వేళ్ళు అలిసిపోయే దాకా రాస్తూనే ఉంటాం
నీళ్ళల్లో సగం తేలుతూ సముద్రాన్ని శాసిస్తాం
ఈ అక్షరాలు కూడా అంతే అన్నీ రాసేశాంలే అనుకునేలోగా ఇంకొన్ని బుల్లి పదాలు పుట్టుక మొదలవుతూనే ఉంటుంది
కొన్నాళ్ళయ్యాక పాత డైరీలనో
అమ్మ దాచిన చిత్తు కాగితాల్లోనో మనల్ని చూసుకుంటాం
మనమేనా వీటిని రాసింది అనుకోక మానం
అప్పుడు ఇంకో ఆలోచన మెదడునూ మనసునూ తొలిచేస్తూ
ఇంకా రాసుండాల్సిందే ఇక్కడే ఎలా ఆపేశాం అనే తపన అంతరాళంలో భావుకతై
కన్నీళ్ళై కవిత్వమై ఇలా పారాల్సిందే కాగితాలు పడవలయ్యే వరకు
మన మునివేళ్ళు వాటిని వదలాల్సిందేగా మనసు సంద్రంలో తెరచాపలు తెంపేసి
ఆగని సేలయేళ్ళై నిశ్చలంగా నిమ్మళంగా మనల్ని పరాయి పెదవులతో చదివించాల్సిందేగా
తెలియని తేలికైన బంధాలను అక్షాలు మళ్ళా దృడంగా మొదలెడతాయి
ఇలా ఇప్పుడు మొదలెడతాం ఇంకోసారేప్పుడో ఆగిపోయిన చోటి నుండి.

No comments:

Post a Comment