Tuesday, December 30, 2014

మసపుని

_______
ఇప్పుడో సంవత్సరం మరణించింది నాతోపాటు
పనికిరాని శవాల మధ్యన నిశ్చలంగా నన్నొదిలేసి వెళ్ళింది
ఆత్మలేని ఒక వెచ్చని శరీరాన్ని గట్టిగా కావలించుకుని ఎన్నాళ్ళయిందో
పెదవుల నడుమ ఒక ఆమని గీతం చితాబస్మాన్ని ఉంచిన సగం మంచుపాత్ర
నాకు కావాలిప్పుడు కొన్ని రోజులు నిండుగా కడిగేసిన అందమైన సమాధి పక్కన గడిపినవి
వేశ్యాకాలం నన్ను తనలో కలుపుకుని ఇప్పుడొదిలేసిన ఆనవాళ్ళు
చెట్లు రాల్చుకున్న ఆకులూ అలానే ఉన్నాయి
వీధి చివరన నల్ల కుక్క పిల్లా బాగుంది
నాకో నిర్లిప్తతలో బలపంగా రాసిన మట్టీ వాసనొస్తోంది
ఎలాగో ఈ చిరిగిన నవ్వులను అతికించుకోవడం
నేర్పకుండానే నీళ్ళొదిలేసుకుపోయింది
నేనూ ఉంటాను
నువ్వూ ఉంటావు కాలపు కొక్కానికి ఉరిపాదులమై
ఇలానే నిర్మిస్తాం మళ్ళా ఒక శాశ్వత పునాదిని
రక్తపు రంగూ మార్చుకుంటాం ఆరేసిన ధరహసాల వెనుక
ఇంకొన్ని నెలలు పిడికిలి మధ్యన చిమ్మిన వీర్యమై చితి పేరుస్తుంది
సరే సరే ఇక కొత్త పిండమెక్కడ
నా మాటలు సంధ్యా వివర్ణమైపోయాయి ఈ నిర్జీవ సంవత్సరంలా

నీ/శబ్దం


కొన్నిసార్లు నిశ్శబ్దాలను ఎక్కడ పారబోయాలో తెలియక అక్కడా ఇక్కడా పారబోసేస్తాం
చిక్కటి రాత్రిలోనో ఇంకో పగటి పువ్వులోనో
అన్ని శబ్దాలు మనవే అనుకుంటాం
అమ్మ నుండి పేగు తెగిన శబ్దం
నేను వేరైన నిశ్శబ్దం
వళ్ళంతా జిగట శబ్దం చాల బాగుంది ఆ దోసిలి
అవును వానచినుకు దోసిలి శబ్దం
కళ్ళ నిండా నీళ్ళ చప్పుడు
రెప్పలు టప టపామంటూ
అంచుల శబ్దం చెంపలపై హిమగిరి భళ్లుమనే నిశ్శబ్దం
ఇంకా నడిచిన గుర్తులు మిగిల్చిన అడుగుల శబ్దం నాలో నీలో
ఎక్కడో చోట నిలబడ్డ నిశ్శబ్దం
ఏముంది ఇలానే అనుకుంటాం
అన్ని శబ్దాలు,నిశ్శబ్దాలు మనమేగా పారబోసామని
చెట్లూ నవ్వడం వాటి ఆకులూ అరవడం నన్ను చూసి
వర్షపు హోరులో తడిసిన మట్టి శబ్దం విన్నాను చాలాసార్లు మనసు తపాళాలో
ఇంకొన్ని చీకట్లలో వెన్నెల వేలాడుతున్న శబ్దం
కరెంటు తీగల మీదో ,వాటి మీద వాలిన పక్షుల రెక్కల మీదో ఉన్న నిశ్శబ్దం
నాకిప్పుడు కావాలి అన్నీ ఒక పొదువు
తేలికైన నిండు శూన్యపు పొదుగు
దండెం పైన నన్ను నేను ఆరేసుకున్న బట్టల చప్పుడు
రోజూ తడుస్తూ ఆరుతున్న శబ్దం
పెరటిలో రాలిన పూలరెమ్మల నిశ్శబ్దం వినడం కొత్తేమి కాదు నాకు
శవాల మీద నుండి కిందపడి నా ముఖం పైన మునకలు వేసిన అందమైన నిశ్శబ్దం
ఇంకా యే నది పక్కనో ఓ సాయంకాలాన్ని ఒంటరిగా పారేసుకున్న శబ్దం
అలలు తరంగాలై,తరంగాలు చేతుల చప్పట్లై నాలోకి దూకిన శబ్దం
వినీ వినీ దాచుకుంటూనే ఉన్న నా అనే మరో నిశ్శబ్దం
ఈరోజు ఆరడుగుల
నేల శబ్దం నాకు మాత్రమే వినబడేట్టు
నిజంగా బాగుంది ఇప్పుడీ నిశ్శబ్దం
వింటారా?

Thursday, December 25, 2014

జట్టు


సాయకాలపు
మైదానం
నీలిరంగు అడవి
పక్షులు కొత్త ఆటగాళ్ళు

చీకట్లను
మోస్తూ
పగటి వేషగాడు
చిమ్మేసిన ఉదయం

వెలుతురు పిట్టల
జననం
ఊరంతా
పాలేరి తలపాగా
ఇంటి చుట్టూతా

కడుపు నిండిన
ఓ భూమి
కొత్త శవాలను
కప్పెడుతూ

నిత్యాన్నదానం
కళ్ళకిటికీలు
మూసివేత
కలల విస్తర్ల
శివారుల్లో

మూగ జీవి
అలంకరణ
నా ఇంటి
మొక్కలకు

పొద్దువాలిన
పిల్లల మూక
పగలంతా
అల్లిన సందడి
సంత

సర్దుకుంటూ
సలుపుతూ
చలికాలపు
ముసురు.


Tuesday, December 16, 2014

నువ్వో...


ప్రపంచమంతా మనలో ఉన్నట్టు తోస్తుంది 
మనల్ని చూసుకున్నప్పుడు
భరోసా ఇస్తున్న క్షణాలు నిన్ను నీలో దాక్కునేలా చేస్తాయి
చీకటీ కురుస్తుంది 
నల్లగా మెరుస్తుంది
ఓ ప్రకృతవ్వాలి నేనిప్పుడంతే
మంచు కాల్చే వెన్నెలరాత్రుల్లో నేనూ ఉంటాను నీతోపాటు 
కుక్క పిల్లలో 
పిల్లి పిల్లలో పసిగా నవ్వుతాయి నన్ను చూసి
ఒక ఒళ్ళు విరుపు ఇష్టంగా తమదవుతుంది అంతే
ఇక అప్పుడు నా కళ్ళూ మెరుస్తాయి ఒక దట్టంగా
కుండీల వెనకాలో మొక్కల సందుల్లోనో భయం భయంగా చూస్తూ లోకానికి తమను పరిచయం చేసుకుంటూ నాతోనూ చేతులు కలుపుతాయి 
నేను ఇక వాటిలో 
అవి నాలో 
నువ్వొచ్చావు ఏంటి అంటూ అప్పుడు
ఇదిగో ఈ చలిరాత్రి వేళప్పుడు కొంత ప్రేమగా చావడం నేర్చుకున్నాం
అవును 
చావు అంటే మాటల్లో మనం చంపుకున్నపుడు మళ్ళా ఒకరోజు కొత్తగా చస్తాంగా 
నువ్వు నాలోకి నేను నీలోకీ కురవలేనప్పుడు అలా ప్రేమగా చస్తాం ఒకసారి
ఒక్కోమారు చిన్న పలకరింపు కూడా గోడలే కడుతుంది మనసు పడిపోకుండా 
అలా ఎన్నిమార్లు నువ్వు ఓ దడవ్వలేదు నాలో
నేను స్రవించిన ప్రతిసారీ కళ్ళలో కురుస్తావు నాతోపాటుగా 
తొలిపలుకు ఏదో మోసుకొస్తావు ఎప్పట్లా కాకుండా 
నేను నీలో పుట్టేలా చేస్తావుగా 
అప్పుడు ఉషస్సులు కురవాలి సదా 
నీ హృదయంలో గడ్డకట్టాలి నేను కొంత దైర్యంలో 
ఇప్పుడిలా భళ్ళున రాలడానికి ఇంకేం అక్కర్లేదు 
ఒక నేను 
నువ్వు 
కొన్ని సగం కళ్ళ ప్రాణాలు.

Monday, December 8, 2014

ఇంకెలా...


అప్పుడెప్పుడో ఒకళ్ళనొకళ్ళం విదిల్చుకున్న జ్ఞాపకం
బతుకు పట్టాల కింద చిక్కగా నలిగి అతుకులేసుకున్న శరీరం
సూరీడు విరజిమ్మిన కుప్పల వీర్యంలో రోజంతా వెలుగుతున్న నేను
చీకట్లకు తలకొరివి పెడుతూ స్ఖలించని కాపరినై నా దేహాన్ని నువ్వూ నేనూ కలిపి పేర్చుకున్న అందమైన చితి మంచం మీద ముచ్చట్లాడుకున్న రతి చక్రవర్తులం మనం కాదా
దూపంలో తడిసిన నీ కురుల వాసాల కింద నేను మిగుల్చుకున్న శల్యసంపద నీ పేరున రాసిన వీలునామా ఇప్పుడు నాలో జేగూరు రూపమెత్తి వృషణాల వెచ్చదనంలో కాల్చుకున్న మర్రి చేతులు
సరే ఇక గాట్టిగా ఏకిభవిద్దాం చచ్చేలోపు నువ్వొచ్చెలోపు
కళ్ళెం తిన్న తల సోరుగులో వేలాడే నవీన నాడులు ఇప్పుడే కదిలి పడుకున్నాయి ముభావంగా
తిమిరం పూసిన నేలపువ్వు నువ్వు
నాట్లు నత్తలు పాకే నేను
ఎలా ఇంకెలా విదుల్చుకోను
నన్నెలా మిగుల్చుకోను
మొత్తం నువ్వే అయ్యాక

Monday, December 1, 2014

అన్నీ అలా


రాత్రి పగలు ఒకేలా ఉన్నాయి నాకిప్పుడు
కళ్ళన్నీ నిశాచరాలయ్యాయి
ఇంతకు ముందు కొత్తగా పలకరించే ఉదయం ఇప్పుడు 
అలవాటుగా పడమటకు వెళ్ళిపోతోంది
మగతగా ఓ నది
నిండా కొన్ని అలలు నా కాళ్ళను తడుపుతూ ఉండేవి ఒకప్పుడు
ఇప్పుడు నన్ను తోసుకుని వెడుతున్న నిశ్శబ్దం
ఏ ఒక్కటిగానో నిలబడడం నేర్చుకున్న చెట్టు
నన్ను చూస్తూనే కౌగిలించుకునే చెట్టు ఇలా చేతులు ముడుచుకుంటోంది
సరే
మట్టితో సంభాషించడం మొదలెట్టాను
అడుగులు పడగానే రివ్వున ఎగసే అలల తుఫాను లేదిప్పుడక్కడ
కొంత శూన్యం మరికొంత స్తంబించిన గాలి
అరచేతుల అంగుటా పరిచి ఎత్తుకున్నా ముఖానికి అంటడం నప్పలేదు
ఇంకా నడుస్తూ
సజీవ సమాధుల వద్దకెళ్లా
గంభీరతలో మునిగి తెల్లగా నవ్వు నన్ను చూస్తూ
ఏం అని అడగలనిపించలా
అలాగే కొసరు దిగులు మనసంతా నింపుకుని పలకరించా
అటు తిప్పిన చప్పుడు
అదుపుతప్పిన నేను
నన్ను నేను తమాయించుకోవడం
మామూలైపోయింది
ఇప్పుడొక్కటే ఘనిభవిస్తోంది
ఆత్మ
L