Tuesday, December 30, 2014

నీ/శబ్దం


కొన్నిసార్లు నిశ్శబ్దాలను ఎక్కడ పారబోయాలో తెలియక అక్కడా ఇక్కడా పారబోసేస్తాం
చిక్కటి రాత్రిలోనో ఇంకో పగటి పువ్వులోనో
అన్ని శబ్దాలు మనవే అనుకుంటాం
అమ్మ నుండి పేగు తెగిన శబ్దం
నేను వేరైన నిశ్శబ్దం
వళ్ళంతా జిగట శబ్దం చాల బాగుంది ఆ దోసిలి
అవును వానచినుకు దోసిలి శబ్దం
కళ్ళ నిండా నీళ్ళ చప్పుడు
రెప్పలు టప టపామంటూ
అంచుల శబ్దం చెంపలపై హిమగిరి భళ్లుమనే నిశ్శబ్దం
ఇంకా నడిచిన గుర్తులు మిగిల్చిన అడుగుల శబ్దం నాలో నీలో
ఎక్కడో చోట నిలబడ్డ నిశ్శబ్దం
ఏముంది ఇలానే అనుకుంటాం
అన్ని శబ్దాలు,నిశ్శబ్దాలు మనమేగా పారబోసామని
చెట్లూ నవ్వడం వాటి ఆకులూ అరవడం నన్ను చూసి
వర్షపు హోరులో తడిసిన మట్టి శబ్దం విన్నాను చాలాసార్లు మనసు తపాళాలో
ఇంకొన్ని చీకట్లలో వెన్నెల వేలాడుతున్న శబ్దం
కరెంటు తీగల మీదో ,వాటి మీద వాలిన పక్షుల రెక్కల మీదో ఉన్న నిశ్శబ్దం
నాకిప్పుడు కావాలి అన్నీ ఒక పొదువు
తేలికైన నిండు శూన్యపు పొదుగు
దండెం పైన నన్ను నేను ఆరేసుకున్న బట్టల చప్పుడు
రోజూ తడుస్తూ ఆరుతున్న శబ్దం
పెరటిలో రాలిన పూలరెమ్మల నిశ్శబ్దం వినడం కొత్తేమి కాదు నాకు
శవాల మీద నుండి కిందపడి నా ముఖం పైన మునకలు వేసిన అందమైన నిశ్శబ్దం
ఇంకా యే నది పక్కనో ఓ సాయంకాలాన్ని ఒంటరిగా పారేసుకున్న శబ్దం
అలలు తరంగాలై,తరంగాలు చేతుల చప్పట్లై నాలోకి దూకిన శబ్దం
వినీ వినీ దాచుకుంటూనే ఉన్న నా అనే మరో నిశ్శబ్దం
ఈరోజు ఆరడుగుల
నేల శబ్దం నాకు మాత్రమే వినబడేట్టు
నిజంగా బాగుంది ఇప్పుడీ నిశ్శబ్దం
వింటారా?

1 comment:

  1. శవాల మీద నుండి కిందపడి నా ముఖం పైన మునకలు వేసిన అందమైన నిశ్శబ్దం...మనసుని తాకింది.

    ReplyDelete