Tuesday, December 16, 2014

నువ్వో...


ప్రపంచమంతా మనలో ఉన్నట్టు తోస్తుంది 
మనల్ని చూసుకున్నప్పుడు
భరోసా ఇస్తున్న క్షణాలు నిన్ను నీలో దాక్కునేలా చేస్తాయి
చీకటీ కురుస్తుంది 
నల్లగా మెరుస్తుంది
ఓ ప్రకృతవ్వాలి నేనిప్పుడంతే
మంచు కాల్చే వెన్నెలరాత్రుల్లో నేనూ ఉంటాను నీతోపాటు 
కుక్క పిల్లలో 
పిల్లి పిల్లలో పసిగా నవ్వుతాయి నన్ను చూసి
ఒక ఒళ్ళు విరుపు ఇష్టంగా తమదవుతుంది అంతే
ఇక అప్పుడు నా కళ్ళూ మెరుస్తాయి ఒక దట్టంగా
కుండీల వెనకాలో మొక్కల సందుల్లోనో భయం భయంగా చూస్తూ లోకానికి తమను పరిచయం చేసుకుంటూ నాతోనూ చేతులు కలుపుతాయి 
నేను ఇక వాటిలో 
అవి నాలో 
నువ్వొచ్చావు ఏంటి అంటూ అప్పుడు
ఇదిగో ఈ చలిరాత్రి వేళప్పుడు కొంత ప్రేమగా చావడం నేర్చుకున్నాం
అవును 
చావు అంటే మాటల్లో మనం చంపుకున్నపుడు మళ్ళా ఒకరోజు కొత్తగా చస్తాంగా 
నువ్వు నాలోకి నేను నీలోకీ కురవలేనప్పుడు అలా ప్రేమగా చస్తాం ఒకసారి
ఒక్కోమారు చిన్న పలకరింపు కూడా గోడలే కడుతుంది మనసు పడిపోకుండా 
అలా ఎన్నిమార్లు నువ్వు ఓ దడవ్వలేదు నాలో
నేను స్రవించిన ప్రతిసారీ కళ్ళలో కురుస్తావు నాతోపాటుగా 
తొలిపలుకు ఏదో మోసుకొస్తావు ఎప్పట్లా కాకుండా 
నేను నీలో పుట్టేలా చేస్తావుగా 
అప్పుడు ఉషస్సులు కురవాలి సదా 
నీ హృదయంలో గడ్డకట్టాలి నేను కొంత దైర్యంలో 
ఇప్పుడిలా భళ్ళున రాలడానికి ఇంకేం అక్కర్లేదు 
ఒక నేను 
నువ్వు 
కొన్ని సగం కళ్ళ ప్రాణాలు.

No comments:

Post a Comment