Thursday, February 5, 2015

రాత్రి దీపం

ఈ రాత్రి చల్లగా కురుస్తున్న ఓ దీపం కదా నీకు నాకు 
మంచు బిందువులన్నీ బాల్కనీ అంచులమీద నిలబడిన పువ్వులై 
కొన్ని అరుపులు వినీ వినబడకుండా 
కొంత దూరంలో ఒక కుక్కో అంతకు మించిన జీవమో
ఏదోకటి మనల్ని పలకరిస్తుంది
ఇక అప్పుడు సర్దిన పక్క ఓ నాలుగు తలగళ్ళు మనకు చుట్టాలై పలకరిస్తాయి
అప్పుడు నిద్రపట్టని మనం నిద్రపోని రోడ్డు మీద అరికాళ్ళతో నడుస్తాము కాస్త దూరం
ఇంకొంత దూరం
కొన్ని మాటలూ దొర్లుతాయప్పుడు ఆ నిశ్శబ్దంలో
గబ్బిలపు రొదల్లో ఇన్నాళ్ళు చేతులంటిన ఒక మనం అలా అలా ఓ తీరపు మట్టిలా రేగి పడతాము ఒక పక్కగా
పగిలిన గాజు ముక్కలు మరికొన్ని తెల్లటి మందారాలు
ఇవిగో అనే నేను
ఎలాగోలా అల్లడానికి ప్రయత్నిస్తాను నీకర్థమయ్యే మాటలనే
కానీ అప్పుడంటావు!ఏమిటీ ఈరోజు కొత్తగా నీ నోటిపూత నన్ను పిలుస్తోందని
పెదవుల యుద్ధం ముగిసాక ఒకలా ప్రేమించుకుంటాము
నువ్వో నేనో పొత్తికడుపులో తల దాచుకుని ఏడుస్తాం
ఇంత దానికే ఇలా అయితే ఎలా చెప్పు అని నువ్వడగడం
ఏం చెప్పాలో తెలియని స్మశానవాటికలో పదాలు కట్టడం మామూలే
ఇంకేముంటాయి అప్పుడు మళ్ళా మనలో మనమేగా
కాసేపు చలిలో డాబా మీదో పిట్టగోడ మీదో అర్దరాత్రుళ్ళు బొమ్మలేస్తాం
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుంటాం అంతే కాంక్ష దాటిన ఒక ఊరిలో
మళ్ళా కలుస్తాం ఇంకోరోజు.

2 comments:

  1. ఏం చెప్పాలో తెలియని స్మశాన వాటికలో పదాలు కట్టడం మామూలే...అద్భుతమైన పదజాలం...

    ReplyDelete