Monday, September 29, 2014

చెట్టుగా ఏర్పడ్డ అణువు

ఆకుల ముంగురులు
చీటికీ మాటికీ
ఉదయిస్తూ అస్తమిస్తూ

ఎటోకటు పచ్చగా
ఊగుతూ
కొండంత గమనాన్ని
తనలో ఇముడ్చుకున్న వాసవి

తేనె సంచులను గర్భమై మోస్తూ
పదేపదే కాస్తూ అప్పుడప్పుడూ
పగిలిన పళ్ళలో గర్భశ్రావమవుతూ
మళ్ళీ మళ్ళీ తనను తాను కూడగట్టుకుంటూ

కాండపు యోని
పసర నెత్తురు కక్కుతూ
వేర్ల మధ్యన ఆరుతూ అంతమవుతూ
ఇంకొన్నిసార్లు  మట్టిలో కొవ్వొత్తిలా
వెలుగుతున్న ఆవిరి
వర్షం పడ్డప్పుడల్లా ఏడుస్తూనే

ఆనందమో దుఃఖమో
ఎప్పుడూ నవ్వుతున్న యోగిలా
గొడ్డలి అంగాలు నిరంతరం చీల్చినా
స్థబ్దుగా సడలని ఓ సంకల్పాన్ని కూసింత
పోసుకుని అక్కడే అలానే

నెలవంక పారబోసిన అరవెన్నెల
తనకో తనువుకో
అంటూ అనుకుంటూ పిందెలై
పరువాలను ఆరబెట్టిన వసంతం

నీకు నాకు నడుమ వారధి నేనంటూ
వణికే ఒక అందమైన వానపాము నా చెట్టు
నమూనాలు ఆ పక్కనో ఈ పక్కనో వెతకాలిగా
కొంత సమయాల తరువాత ఇప్పుడు కొన్ని గుర్తులు దాచుకుందాం.

అవ్యక్తాలు


కొన్నిరోజులు ఒకప్పుడు నిశ్శబ్దాలు నిజాయితీగా మాట్లాడేవి
కాలం ఎదురుచూపులు నీకు నాకు తెలియని వేళలు
తీరాలను ఇద్దరం పంచుకునే భుజాలు పక్కపక్కగా నవ్వేవి
చప్పట్లను లెక్కెట్టే ఆ క్షణాలు ఒకరికోసం  ఒకరు పోసుకునే ఇసుక తలంబ్రాలు మనసు మూలల్లో ఎప్పటికీ అందమైన కెరటాలే
కులాసానా
కుశలమేనా అనడిగే మనసువాసన పసిగట్టే ఉత్తరాలు నా ఇంటా నీ ఇంటా హస్త రాతలయ్యేవి
డైరీల మధ్యన ఖాళీలలో ఇమిడిన క్షణాలు అచ్చులు పోసుకున్న నెమలి పిల్లల్లా నిన్నో నన్నో తడుపుతూనే ఉంటాయి గుండె గతుకుల్లో
ఇప్పటికీ అవే జ్ఞాపకాలు ఇరుపక్షాలలో బయటపడని కవనాలు
నిన్నటిని నేటికి చూపిస్తూ నిన్ను నాకు ,నన్ను నీకు మరచిపోని కొత్త మనల్ని కొంతైనా కట్టుకునేట్టు చేస్తాయి
ఎర్రసింధురాలు నా కళ్ళలో మెరిసే సీతాకోకచిలుకలు రంగులద్దని ఆత్మలు
కుప్పపోసి కడిగిన చినుకులు కదా స్వచ్చంగా గుబాళింపు ఎప్పుడూ గుర్తు చేస్తూ
దూరాలు పెరిగినా ఆ మనం ఇలానే ఎక్కడోకక్కడ ఉత్తరాల మధ్యన చూసుకుంటూనే ఉంటాం మనసు తడిసినప్పుడల్లా

Thursday, September 25, 2014

పరాన్నం అనబడే ..


తను ఎప్పుడూ
ఒకేలా కనబడుతుంది నాకు

వంటింట్లోనో,వాకిట్లోనో తన దేహం
ఎప్పుడూ ఏదోక వ్యాపకంలో

కంట్లో కనబడని నలుసులెన్నున్నా
ఒక నవ్వును నిరంతరం కన్నీళ్ళలో ఉంచుకుంటుంది

నాకో తనకో ఎప్పుడోకప్పుడు
కాసింత ఖాళీ దొరికితే తీరిగ్గా
పలకరించుకుందామని ఎన్నోసార్లు అనుకుంటాం

సాయంకాలం ఆకులపై కురిసే
ఆకుపచ్చని ఎండలా తను
స్వచ్చంగా మెరుస్తుంది

అలసిన ఆ వ్యక్తి మా అందరికీ తెలిసినా
తన ఉనికిని నిలబెట్టే
యత్నంలో
ఒక పరాన్నమయింది

Monday, September 22, 2014

ఒక

నిర్విరామ క్షణాలు కొన్ని మనలో కలుషితమవుతూ
కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఒక మస్తిష్క రైలు బండి నీలో నాలో ఎప్పుడూ ఆగుతూనే ఉంటుంది సంకెళ్ళను కంటి తెర మీద చూపిస్తూ
గీతలు గీస్తూ పద్దాకా ఓ బలపం అవుతూ రాసిన హత్యాక్షరి
కొత్త పుర్రెలను బిగించుకున్న సందడి మెదడు సంతలో తీరనే లేదు
ఎగువ దిగువ తరంగాలు వరుస కడుతూ కంపనం
ఇంటిగ్రిటీ నాలో ఎక్కడో వెతుక్కునే ఆత్మనై  ప్రతి సాయంత్రం కొంత మట్టిని వంట్లోకి తీసుకునే నిశ్శబ్ద కెరటంలా ఎక్కడో చోట పడడం నాకు తెలుస్తూ
ప్రణాళికలు ప్రవచనంలా నానుతూ బూరుగు బరువుతో ఇంటి నిండా రాలాల్సిందే ఈ సమయం
చిక్కబట్టిన మొండాలు తడియారకుండా అక్కడక్కడా పడ్డప్పుడు చేతుల్లో లెక్కెటడం అలవాటు కాదేమో మరి
జ్వలిత మేఘాలు ప్రజ్వలించిన చినుకుల్లా దూకడం అందమైన పిల్లిలా చెదిరి పడడం
ఇంకోసారి ఇప్పటిలా కాదు కసంసే అన్న నాలుక వీపుపైన బాణపు గుర్తులుగా ముద్ర పడే ఉంటుంది ప్రతిసారీ
కావాలంటే తిరిగి చూసుకో ఖాందానాలో మగ్గిన శవాలను పలకరించు ఓసారి
నిష్కలుషిత స్వప్నం తెల్లారి చూపెడుతూ

Wednesday, September 17, 2014

అందమైన ఖననం


నచ్చడం నచ్చకపోవడం అంటూ ఏమి ఉండదు పెద్దగా
నీ ఆలోచనలను నేను పంచుకోనంతే
నాలోకి నువ్వు రాలేవంతే
ఇద్దరమూ ఒకేలా ఉంటాం కాకపోతే కాలిపోయిన శవాల్లా
మళ్ళా ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి ఎప్పుడూ నప్పుతూనే ఉంటుంది
నువ్వో నేనో మన కాళ్ళ కింద అరచేతులవుతాం కొంచం ఆసరాగా అంతే తేడా 
నీలో నిండిన మృదుత్వం ఇప్పుడు నాలో నిండుకుంది బియ్యపు డబ్బాలో తలలు వాల్చిన గింజల్లా
నావెనక నీవు నీ వెనుక నా అనబడే ఇంకో నేను ఎప్పటికీ ఉంటానే ఉంటాం 
ఇది స్నేహం కాదు 
ప్రేమ కాదు 
మోహం కామం అసలే కాదు 
దేహాలతో కాకుండా ఆలోచనల్లో రమించడం 
మాటలతో ఒకటవ్వడం
రెండు చేతులూ ఒకేలా రాయడం 
కలిసి కురవడం అంతే

నేను నీలో పుట్టడం 
నువ్వు నాలో ప్రాణించడం  బాగుంటుంది కదూ ఇలా 
ఎన్నాళ్ళు శరీరాల మీద రాసుకుంటాం మోహాల రొచ్చును
కొనాళ్ళు మంచి సమాధులమవుదాం అనిర్దేశిత దారి చివర్లలో 
తెల్లగా నవ్వుకుంటాం నీకూ నాకూ వినబడేలా 
ఇరు పుర్రెల మీదా కొన్ని గడ్డకట్టని రక్తపు చుక్కలున్నాయి 
పద్దాకా అంటుకడతాం కొత్త మంచు ఖండల్లా 
లోకా అసమస్తo నువ్వూ నేనూ

కారణాలేం ఉండవు మనకు
ఇరువురుం బూడిద దిబ్బల మీద నిలబడ్డ అందమైన దిష్టి బొమ్మలమే
అంత అందంగా నల్లగా నవ్వడం మనకు మాత్రమే తెలిసిన భాష
తెల్లగా పళ్ళికిలిస్తూ వీపు వెనకాల కొన్ని కట్టెలు కాల్చుకుంటాం

జననం 
ఖననం 
మనకిది మాములే 
మళ్ళా ఎప్పుడో కొన్ని సాయంత్రాల మరణం తరువాత చీకట్లో మెరిసే ఆత్మలవుతాం.

Monday, September 15, 2014

Soil Rain

Outside at the open land the Smell of soil
As a consequence of Yesterday night’s rain
However I tried to obstruct it perched as a memory
In the pages of heart
In the trance of wet green leaves of all the body
A honey tingling in enrapture
Like a spring that pats and goes now and then
For this rain
Amid the dark clouds a tune with a bang
Sweet to soul to listen
Another dais with in the deep of heart
Many a flower dropping their petals
Spread on the lonely path with contentment
Removing the veil of darkness the sky
Giving for taste the seeped droplets of water
Some relaxed in the cup of hands
When the main roads became short
As if the paper boats made in the childhood
Still go on roaming somewhere
A sweet signature in this rain
Again
Crores of seeds await in my eyes to germinate
Waiting for the churning of clouds
Somewhere in the future

Saturday, September 13, 2014

నేనిలానో ఇంకోలానో

నేనిలానో ఇంకోలానో ఉంటాను
ఉండాల్సిందేగా
నీకు నచ్చేలా ఉండడాన్ని నిరసిస్తూ ఎంతకాలం ఇంకా
నా దారిలో నేను బతుకుతూ ఉంటే ఏమైందో తెలియని ఒకానొకచోట ఇద్దరం కూర్చున్నట్టు
అనిపిస్తూ ఉండడం ఏమిటి?
నేను మళ్ళా అంతరంగీకరించుకోవడం ఎందుకు?
పగలో రాత్రో పుడతాను నాకు నేనుగా
మళ్ళీ ఎప్పుడో రమిస్తాను నాలో నేనే
ఇక నీ గురించి ఏం చెప్పను
నా చేతులన్నీ నిన్ను తాకడం,తాకినట్టు భ్రమించడం నావల్ల కాదు
పైకి మాత్రం ఇద్దరం ఒకేలా కనిపిస్తాం
ఎప్పటికీ మారం
కొత్తగా చెప్పేదేముంది ఇంకా ఎప్పుడూ ఉంటూనే ఉంటాం ఇలానో మరోలానో

నాలోకో నీలోకో ఎప్పుడోకప్పుడు ప్రయాణిoచాల్సిందేగా  ఒకరికొకరం ఇష్టం ఉన్నా లేకపోయినా
ఏదోకరోజు నా మనసు కొంత ఇష్టాన్ని పోసుకుని నీమీద కురవడం అంత బాగోకపోవచ్చు
ఎందుకంటే ఇప్పటి దాకా ఎవరి సమాధుల్లో వాళ్ళుoడి ఇలా ఒక్కసారిగా తవ్వుకోవడం ఎందుకు
కాసేపయ్యాక మళ్ళా నచ్చుకుoటాం నువ్వూ నేనూ
ఒకసారి నడుస్తాం,నవ్వుతాం ...నడకా నవ్వూ మామూలే మనమే కొంచం కొత్త

ఇలానో ఇంకోలానో
మళ్ళా కలుద్దాం

Wednesday, September 3, 2014

గది కిటికీ

ఒక్కోసారి సగం తెరిచిన గది కూడా మాట్లాడుతుంది
తన కడుపులో ఉన్న కిటికీలు బయట ప్రపంచాన్ని పూర్తిగా  మింగనూ లేవూ కక్కనూ లేవూ
అటూ ఇటూ  కర్టన్లతో కప్పుకుంటూ చూస్తుంటాయి నిన్నో నన్నో
ప్రతిరోజూ కొన్ని ఉదయాలనూ సాయంత్రాలనూ నా కళ్ళలో పోసి పోతుంటాయి
నుసులు పట్టిన నుదురు కన్నాల్లో నులుముకుంటూనే ఉంటా
నిన్నటినో రేపటినో తలుచుకుంటూ  కూర్చుంటాను బూజు పట్టిన మూలల్లో
రెక్కలు తెగిన సీతాకోకచిలుకలు కొన్ని గోడ మీద పాకుతూ కనిపిస్తాయి నా ముందు
వాటి రక్తపు చుక్కలు నా పక్కగా నదులవుతాయి
అందంగా కూస్తూన్న బల్లిపిల్లల పలకరింపు నాకు కొత్తేమీ కాదు
గొంతులో వెక్కిళ్ల శబ్దం అప్పుడప్పుడూ పరావర్తనం చెందుతూ
నేలకతికించిన నాపరాళ్ల సందుల్లో దాక్కోవడం బాగా గుర్తు
ఇంకని  సున్నపు చెమ్మ గదంతా గంధమై పులుముకోవడం చూస్తుంటాను
పగలో రాత్రో బిగ్గరగా చప్పుడు చేస్తూ
తలుపులు గాలిని మింగేసి దుమ్మును జల్లడం
అప్పుడు నా చేతివేళ్ళు చీపురు పుల్లలై కడుగుతూ పోతుంటాయి
నన్నెందుకు పంపించేస్తున్నావు తన నుండి దూరంగా అంటూ విసిరే ప్రశ్నలు నా ముఖానికి తగులుతూ తోసేస్తాయి నన్ను ఊడ్చేసుకోలేని అగాధంలోకి...