నచ్చడం నచ్చకపోవడం అంటూ ఏమి ఉండదు పెద్దగా
నీ ఆలోచనలను నేను పంచుకోనంతే
నాలోకి నువ్వు రాలేవంతే
ఇద్దరమూ ఒకేలా ఉంటాం కాకపోతే కాలిపోయిన శవాల్లా
మళ్ళా ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి ఎప్పుడూ నప్పుతూనే ఉంటుంది
నువ్వో నేనో మన కాళ్ళ కింద అరచేతులవుతాం కొంచం ఆసరాగా అంతే తేడా
నీలో నిండిన మృదుత్వం ఇప్పుడు నాలో నిండుకుంది బియ్యపు డబ్బాలో తలలు వాల్చిన గింజల్లా
నావెనక నీవు నీ వెనుక నా అనబడే ఇంకో నేను ఎప్పటికీ ఉంటానే ఉంటాం
ఇది స్నేహం కాదు
ప్రేమ కాదు
మోహం కామం అసలే కాదు
దేహాలతో కాకుండా ఆలోచనల్లో రమించడం
మాటలతో ఒకటవ్వడం
రెండు చేతులూ ఒకేలా రాయడం
కలిసి కురవడం అంతే
నేను నీలో పుట్టడం
నువ్వు నాలో ప్రాణించడం బాగుంటుంది కదూ ఇలా
ఎన్నాళ్ళు శరీరాల మీద రాసుకుంటాం మోహాల రొచ్చును
కొనాళ్ళు మంచి సమాధులమవుదాం అనిర్దేశిత దారి చివర్లలో
తెల్లగా నవ్వుకుంటాం నీకూ నాకూ వినబడేలా
ఇరు పుర్రెల మీదా కొన్ని గడ్డకట్టని రక్తపు చుక్కలున్నాయి
పద్దాకా అంటుకడతాం కొత్త మంచు ఖండల్లా
లోకా అసమస్తo నువ్వూ నేనూ
కారణాలేం ఉండవు మనకు
ఇరువురుం బూడిద దిబ్బల మీద నిలబడ్డ అందమైన దిష్టి బొమ్మలమే
అంత అందంగా నల్లగా నవ్వడం మనకు మాత్రమే తెలిసిన భాష
తెల్లగా పళ్ళికిలిస్తూ వీపు వెనకాల కొన్ని కట్టెలు కాల్చుకుంటాం
జననం
ఖననం
మనకిది మాములే
మళ్ళా ఎప్పుడో కొన్ని సాయంత్రాల మరణం తరువాత చీకట్లో మెరిసే ఆత్మలమవుతాం.
No comments:
Post a Comment