Monday, September 29, 2014

అవ్యక్తాలు


కొన్నిరోజులు ఒకప్పుడు నిశ్శబ్దాలు నిజాయితీగా మాట్లాడేవి
కాలం ఎదురుచూపులు నీకు నాకు తెలియని వేళలు
తీరాలను ఇద్దరం పంచుకునే భుజాలు పక్కపక్కగా నవ్వేవి
చప్పట్లను లెక్కెట్టే ఆ క్షణాలు ఒకరికోసం  ఒకరు పోసుకునే ఇసుక తలంబ్రాలు మనసు మూలల్లో ఎప్పటికీ అందమైన కెరటాలే
కులాసానా
కుశలమేనా అనడిగే మనసువాసన పసిగట్టే ఉత్తరాలు నా ఇంటా నీ ఇంటా హస్త రాతలయ్యేవి
డైరీల మధ్యన ఖాళీలలో ఇమిడిన క్షణాలు అచ్చులు పోసుకున్న నెమలి పిల్లల్లా నిన్నో నన్నో తడుపుతూనే ఉంటాయి గుండె గతుకుల్లో
ఇప్పటికీ అవే జ్ఞాపకాలు ఇరుపక్షాలలో బయటపడని కవనాలు
నిన్నటిని నేటికి చూపిస్తూ నిన్ను నాకు ,నన్ను నీకు మరచిపోని కొత్త మనల్ని కొంతైనా కట్టుకునేట్టు చేస్తాయి
ఎర్రసింధురాలు నా కళ్ళలో మెరిసే సీతాకోకచిలుకలు రంగులద్దని ఆత్మలు
కుప్పపోసి కడిగిన చినుకులు కదా స్వచ్చంగా గుబాళింపు ఎప్పుడూ గుర్తు చేస్తూ
దూరాలు పెరిగినా ఆ మనం ఇలానే ఎక్కడోకక్కడ ఉత్తరాల మధ్యన చూసుకుంటూనే ఉంటాం మనసు తడిసినప్పుడల్లా

No comments:

Post a Comment