Friday, October 31, 2014

వాన


రోడ్డు మీద నడుస్తున్న నేను
నన్ను పలకరించరించడానికొచ్చిన ఒక ముసురు వాన
తుంపరలన్నీ మట్టిలో తడుస్తూ తొణికిసలాడే మొసళ్ళు
ముఖం మీదో
చేతుల పైనో భళ్ళున పడి జారిపోవడం
చొక్కా జేబులో గుప్పెడు మన్నీళ్ళు
ఇంట్లోకొచ్చాక ఒక తడి వాసన తల నిమిరిన నా చేతివేళ్ళకు
చీమలు పాకిన ఆకులు పడవలై అక్కడక్కడే
బాల్కనీ అంతా నిండిన కొత్త నీళ్ళు
తడిసిపోయిన కాగితాలు పుస్తకాల్లో దాక్కుంటూ రంగులను విసిరి ఎక్కడో జల్లుతాయి
నిన్నూ నన్నూ ఒక్కసారి కదుపుతూ
పచ్చని అడవిలో అడక్కుండా కురిసిన శబ్దం
కీచురాళ్ళ సంగీతం వినబడీ వినబడకుండా
మసకగా అడుగులు మన్నురోతలో
రేగడి కళ్ళను తెరుస్తూ మూస్తూ
రెండు చెక్క తలుపులు కిర్రున బతికిన చప్పుడు నాకెందుకో  మరోలా పోస్తూ
చెవుల రెక్కలు వింటున్న విహంగాలు నా వాన మాటలు
లోనెక్కడో ఇంకా కురుస్తూ

కిటికీలోంచి

ఒక రాత్రి
కొన్ని నిశ్శబ్దాలను మింగిన గంభీరం
చీకటిని కలలుగా కళ్ళలో పోసుకున్న స్తబ్ధత

ఒక ఉదయం
వాకిళ్ళలో పచ్చగా కురుస్తూ
చలి పిచ్చుక కప్పుకున్న కంబళి గూడు
ఎవరినో ఎప్పుడూ అల్లుతూ
తెగిన కొన్ని వెంట్రుక రెక్కలు
తనకెప్పుడూ చేతులేగా

కిటికీలోంచి దొర్లి పడిన నా ఆత్మ
ఇప్పుడింకోసారి తేలికవుతూ
దూది రెమ్మవడం కొత్తేమి కాదు

కాలువలో కొన్ని ఊపిరులు
శ్వాసలుగా అస్తమయం
చూసావా ఆ శూన్యాన్నీ ఎలా నిండుకున్నదో

ఒక గమనం
మాటలను మోస్తూ శ్రమించడం మనకోసం
స్ఖలించిన దుప్పట్లు
వంటిపై ఆవిరవుతూ
తేనె పళ్ళ జననం

మరో
రాత్రి
వేకువ ఎప్పుడో ఇలా

sometimes

ఒక్కోసారెప్పుడో కొంత శాంతి అనబడే దారమొకటి చుట్టుకుపోతుంది
సమూహంగానో
అసమూహంగానో

నువ్వొక్కడివే కాళ్ళ బొటన వేళ్ళను బ్రతిమిలాడుకుంటూ గోళ్ళ శిరస్సులో అచేతన చేదన మొదలెడతావు
సర్దుకున్న అలమరానో
అందులోని అరలో గజిబిజిగా తయారవుతాయి

డాబా మీద ఖాళీగా ఉన్న గాలిని ఒకింత నీలోకి తీసుకున్నాక కాస్త సుఖపడడం నేర్చుకుంటావు

అప్పటికీ పెచ్చులూడిన దేహాలు కొన్ని గోడకు అతుక్కున్న పేగుల్లా వేలాడడం
నీ మనసు నిశ్శబ్దంలో ఊగిసలాడడం చూస్తుంటావు

మెట్ల మీద రేగిన ధూళి నీ పాదాక్రందనలై వినబడడం నీకు తెలియదు చాలాసేపటిదాకా
 
వదిలేస్తూ
విడివడుతూ
నేస్తూ
పేనుకోవడం బాగానే

మండువాలో జరిగే పరీక్షలకు ఎదురయ్యే షికాయత్ల పద్దు గుర్తేగా
జాగో ఫిర్ సచ్చా ఇన్సాన్ బన్ నే తక్

ఒక రాత్రి

ఒక రాత్రి మొదలవుతుంది మళ్ళా ఎప్పుడో
రోజంతా పనిచెసిన కనురెప్పలు అప్పుడప్పుడే తలుపులేసుకుంటాయి
రెక్కలలసి పోతాయి
ఉద్వేగాలను,దిగంతాలనూ మింగిన చీకటి ఇదే
ఇప్పుడిక్కడ ఒక్కసారే ఊడిపడింది
తడిశామో ఆరామో
తనువులను మాత్రం ఇలా ఈ శూన్యంలో పరిచాం
వెలిగించిన కొవ్వొత్తులు ఒక్కొక్కటిగా ఒత్తులార్పుకుంటూ కొండెక్కుతాయి
వాలు కుర్చీలన్నీ ఖాళీ స్మశానాలవ్వడం
ఎవరో ఒకర్ని కూర్చోబెట్టుకోవడం మామూలైపోతుంది
అలా వరుసలో నిలబడ్డ నక్షత్రాలన్నీ ఉరితీతకు సిద్ధపరచుకుంటాయి వాటంతటవే
తోకచుక్కలై ఇక్కడే ఎక్కడో రాలిపడతాయి
అప్పుడు అదే రాత్రి ఇంకోసారి చిక్కబడుతుంది
తారు డబ్బాలో ఇంకొన్ని కంకర్రాళ్ళు స్వరాలవుతాయి
గుండె  చప్పుడు వినగలిగేంత దూరంలో ఒక చెవి
నీ ముందు వేలాడే పాపిడి బిళ్ళలు
మళ్ళీ రాస్తాం కొన్ని పేజీలను అరువు తెచ్చుకుని
బాధనంతా ఒలకబోసి తేలిక రెమ్మల్లా తడారుతాయి
ఒక రాత్రి
కళ్ళు తీరిగ్గా
శరీరం మరో కక్షలో

Wednesday, October 15, 2014

గాజు రేఖ


జీవితపు సరంజామా ఎప్పుడూ ఒకింత ఖాళీగానే నిండుకుంటుంది
కొన్నాళ్ళు పోగేసుకున్నవన్నీ ఒక్కసారిగా కోల్పోవడం
వాటిని వెతుక్కుంటూ మళ్ళా కొంత దూరం నడవడం అరికాళ్ళనేసుకుని
భుజాల దిళ్ళను తడిపే ఒకానొక అశ్రుధారలను కక్కుతూనే ఉంటాం కళ్ళతో
ఏదో చెప్పాలనుకుని బయలుదేరతామా అక్కడే ఆగిపోతాం మనసు తెగిపడిన ముక్కలను మళ్ళా మళ్ళా సమకూర్చుకుంటూనో ఏర్పడతాం
గాజుగదుల్లో వెలుతురు రేఖలు వక్రీభావించాక నువ్వో నేనో తుడుస్తాం అరచేతుల గుడ్డలను కత్తిరించి
ఇదేదో బానే ఉంది ఒకసారి కరగడం
ఘనీభవించడం తూర్పునో పడమరనో తుదిగా రాలిపడ్డ రేఖాంశాల వైశాల్యాలను గతాలతో కొలవడం అలవాటయిపోయాక ఇక ఏమి ఉండదుగా
నిర్లిప్తాలనో
నిర్మానుషాలనో ఒక్కొక్కటిగా వడగొడుతూనే ఓదార్చుకుంటాం
కాసేపు కనిపిస్తాం మనం కాని ఇంకో మనంగా
అప్పుడంతా కరివేరెమ్మల సుగంధమే గదుల నిండా
పొద్దున్నే మంచు పట్టిన ఉయ్యాల బల్లమీదో
తడుస్తూ ఆరుతూ ఉండే కుక్కపిల్లల నుదురు మీదో బతికేస్తాం
ఎంత వద్దన్నా అక్కడక్కడే మనల్ని మొదలెడతాం ఇంకోసారి

Wednesday, October 8, 2014

నీరెండ


కొన్ని ఉదయాలు
స్తబ్దత ఉన్న తరంగాలుగా
ఆకులపై రాత్రి విడిచిన గుర్తులు మంచుబిందువులై ప్రసవించడం
నీ కళ్ళలోనో నా చేతుల్లోనో ఒక్కోసారి తేలికగా ఇంకాల్సిన నుసులు
అలా ఎప్పుడో నేనూ తడుస్తాను నువ్వు లేకుండానే
అందంగా కొన్ని ఉమ్మెత్త పూలు ప్రతిసారీ ఆత్మహత్య చేసుకుంటూనే నీ చూపులు దాటి వెళ్ళినప్పుడల్లా
సరే ఇక సముదాయించాలిగా నువ్వో నేనో
మన మధ్య కొన్ని సంజాయిషీలను నిలబెట్టడం
విచ్చిన్న ఆత్మలుగా దిక్కులనంటడం కళ్ళరాళ్లు
మనం కూడా విగత జీవులమేగా అప్పుడప్పుడూ
రెప్పల కిటికీలను బలవంతంగా మూసినప్పుడల్లా
ఎందుకో స్మశానాలను కూర్చోబెట్టుకోలేము పక్కన
స్వచ్చంగా సంధి చేస్తున్నా
ఇప్పుడు మళ్ళీ పుడతాయి కొత్త సమాధులుగా
ఒకప్పుడు జీవించిన మరణాలు

Monday, October 6, 2014

పింగాణీ ఆత్మలం


అసంఖ్యాకమైన ఆలోచనలు నీలో నాలో
దిశానిర్దేశాలు ఇప్పుడు
పాడుబడ్డ ఒక పాత్ర మన ముందు చేతులు కట్టుకుని
నువ్వూ నేనూ జీవాలను అందులో పారబోశాం ఎప్పుడో
ఇప్పుడు మిగిలింది కేవలం మనం అనబడే మనం మాత్రమే
తీగలుగా వేలాడతాం ఒకరికొకరం ప్రశ్నార్థకాలుగా
రోజులను ,సంవత్సరాలను వెనకాల పోసుకుంటాం
రక్తమో
చిక్కని అనిశ్చిత వీర్యమో
మళ్ళా నీలానో నాలానో
గడ్డకట్టి స్రవించని గర్భాశయాలు ఇరువురి తలల్లో మోస్తూనే ఉంటాం
ఎవరికీ అర్థంకాము అలా ఉండిపోతాం కొన్నాళ్ళకి
అయిందా అంటుకట్టడం అని నువ్వో నేనో అడగక మానం
ప్రత్యర్థులూ మనమే
స్నేహితులమూ మనమేగా
నింపాదిగా నిండుకుంటాం అప్పుడప్పుడూ
మనసు పగలడం అంటూ ఏమి ఉండదు
అది రాతల్లో భ్రమగా మాత్రమే
ఏ రాత్రో ఒద్దికగా కాలుతాం ఇరువురం ఒకరి ఆలోచనల్లో ఇంకొకరం
అప్పుడు కూడా ఒద్దికగానే ఉంటాం ఇంకోసారి మాటలను పేర్చుకుంటూ
ఇప్పుడొక అ|సంతృప్తి ఒకింత ఖాళీల్లో ఒలిగిపోయాక
ఇప్పుడు రెండు పార్థీవాలం
నిజం కదూ