అసంఖ్యాకమైన ఆలోచనలు నీలో నాలో
దిశానిర్దేశాలు ఇప్పుడు
పాడుబడ్డ ఒక పాత్ర మన ముందు చేతులు కట్టుకుని
నువ్వూ నేనూ జీవాలను అందులో పారబోశాం ఎప్పుడో
ఇప్పుడు మిగిలింది కేవలం మనం అనబడే మనం మాత్రమే
తీగలుగా వేలాడతాం ఒకరికొకరం ప్రశ్నార్థకాలుగా
రోజులను ,సంవత్సరాలను వెనకాల పోసుకుంటాం
రక్తమో
చిక్కని అనిశ్చిత వీర్యమో
మళ్ళా నీలానో నాలానో
గడ్డకట్టి స్రవించని గర్భాశయాలు ఇరువురి తలల్లో మోస్తూనే ఉంటాం
ఎవరికీ అర్థంకాము అలా ఉండిపోతాం కొన్నాళ్ళకి
అయిందా అంటుకట్టడం అని నువ్వో నేనో అడగక మానం
ప్రత్యర్థులూ మనమే
స్నేహితులమూ మనమేగా
నింపాదిగా నిండుకుంటాం అప్పుడప్పుడూ
మనసు పగలడం అంటూ ఏమి ఉండదు
అది రాతల్లో భ్రమగా మాత్రమే
ఏ రాత్రో ఒద్దికగా కాలుతాం ఇరువురం ఒకరి ఆలోచనల్లో ఇంకొకరం
అప్పుడు కూడా ఒద్దికగానే ఉంటాం ఇంకోసారి మాటలను పేర్చుకుంటూ
ఇప్పుడొక అ|సంతృప్తి ఒకింత ఖాళీల్లో ఒలిగిపోయాక
ఇప్పుడు రెండు పార్థీవాలం
నిజం కదూ
No comments:
Post a Comment