Friday, October 31, 2014

ఒక రాత్రి

ఒక రాత్రి మొదలవుతుంది మళ్ళా ఎప్పుడో
రోజంతా పనిచెసిన కనురెప్పలు అప్పుడప్పుడే తలుపులేసుకుంటాయి
రెక్కలలసి పోతాయి
ఉద్వేగాలను,దిగంతాలనూ మింగిన చీకటి ఇదే
ఇప్పుడిక్కడ ఒక్కసారే ఊడిపడింది
తడిశామో ఆరామో
తనువులను మాత్రం ఇలా ఈ శూన్యంలో పరిచాం
వెలిగించిన కొవ్వొత్తులు ఒక్కొక్కటిగా ఒత్తులార్పుకుంటూ కొండెక్కుతాయి
వాలు కుర్చీలన్నీ ఖాళీ స్మశానాలవ్వడం
ఎవరో ఒకర్ని కూర్చోబెట్టుకోవడం మామూలైపోతుంది
అలా వరుసలో నిలబడ్డ నక్షత్రాలన్నీ ఉరితీతకు సిద్ధపరచుకుంటాయి వాటంతటవే
తోకచుక్కలై ఇక్కడే ఎక్కడో రాలిపడతాయి
అప్పుడు అదే రాత్రి ఇంకోసారి చిక్కబడుతుంది
తారు డబ్బాలో ఇంకొన్ని కంకర్రాళ్ళు స్వరాలవుతాయి
గుండె  చప్పుడు వినగలిగేంత దూరంలో ఒక చెవి
నీ ముందు వేలాడే పాపిడి బిళ్ళలు
మళ్ళీ రాస్తాం కొన్ని పేజీలను అరువు తెచ్చుకుని
బాధనంతా ఒలకబోసి తేలిక రెమ్మల్లా తడారుతాయి
ఒక రాత్రి
కళ్ళు తీరిగ్గా
శరీరం మరో కక్షలో

No comments:

Post a Comment