Wednesday, October 15, 2014

గాజు రేఖ


జీవితపు సరంజామా ఎప్పుడూ ఒకింత ఖాళీగానే నిండుకుంటుంది
కొన్నాళ్ళు పోగేసుకున్నవన్నీ ఒక్కసారిగా కోల్పోవడం
వాటిని వెతుక్కుంటూ మళ్ళా కొంత దూరం నడవడం అరికాళ్ళనేసుకుని
భుజాల దిళ్ళను తడిపే ఒకానొక అశ్రుధారలను కక్కుతూనే ఉంటాం కళ్ళతో
ఏదో చెప్పాలనుకుని బయలుదేరతామా అక్కడే ఆగిపోతాం మనసు తెగిపడిన ముక్కలను మళ్ళా మళ్ళా సమకూర్చుకుంటూనో ఏర్పడతాం
గాజుగదుల్లో వెలుతురు రేఖలు వక్రీభావించాక నువ్వో నేనో తుడుస్తాం అరచేతుల గుడ్డలను కత్తిరించి
ఇదేదో బానే ఉంది ఒకసారి కరగడం
ఘనీభవించడం తూర్పునో పడమరనో తుదిగా రాలిపడ్డ రేఖాంశాల వైశాల్యాలను గతాలతో కొలవడం అలవాటయిపోయాక ఇక ఏమి ఉండదుగా
నిర్లిప్తాలనో
నిర్మానుషాలనో ఒక్కొక్కటిగా వడగొడుతూనే ఓదార్చుకుంటాం
కాసేపు కనిపిస్తాం మనం కాని ఇంకో మనంగా
అప్పుడంతా కరివేరెమ్మల సుగంధమే గదుల నిండా
పొద్దున్నే మంచు పట్టిన ఉయ్యాల బల్లమీదో
తడుస్తూ ఆరుతూ ఉండే కుక్కపిల్లల నుదురు మీదో బతికేస్తాం
ఎంత వద్దన్నా అక్కడక్కడే మనల్ని మొదలెడతాం ఇంకోసారి

No comments:

Post a Comment