Wednesday, August 13, 2014

ఖాళీ సీసా

కొన్నాళ్లుగా ఇక్కడే పడుకుని ఉన్నాను
నా పైన సముద్రాన్ని కప్పుకుని
లేచి బయటకొచ్చి కూర్చుంటాను స్తబ్ధుగా
ఒక్కసారిగా తన చేతులు కెరటాల్లా కప్పేస్తాయి

ఎవరు చెప్పారు నీళ్ళకి రంగులేదని
ఆకాశం ఒక్క ఉదుటున దూకి పడ్డప్పుడు తనలో కరిగిన నీలం రంగు కదా
పాలస్తీనా పసికందుల తలలు పగిలినప్పుడు చూడలేదా ఎర్రరంగును వారి కళ్ళలో
గాజా మొత్తం తడారిపోలేదా ఆ ఆక్రందనలతో
ఇప్పుడు విను ఆ నొప్పి కన్న ఒక ఉదయాన్ని
నీ ఆలోచనలకు పూసుకో ఆ వర్ణాన్ని

ఒక వినోదం నీకు కనిపిస్తుంది స్పందనకు నీళ్ళొదిలినప్పుడు
రాజరికానికి బానిసైన కొన్ని ఆత్మలను వాసన చూసావా ఎప్పుడన్నా
ఇంకో
ఘటన
సంఘటన
కాస్త క్యూరియాసిటి
పొద్దున్నే పేపర్లో నిన్ను నువ్వు జొప్పుకుని కొన్ని వార్తలను జేబులో వేసుకుని వెళతావు
రోజంతా సరిపడేన్ని
ప్రమాదం
కాఫీతో కాలయాపన
నాలికపై
నరాల్లో ఏం మిగిలింది

మరికొన్ని చూస్తావు
చదువుతావు
అక్కడెక్కడోలే
సాయంత్రం సినిమా
తంత్రి
భావోద్వేగం
కృత్రిమం
చలికాలపు పువ్వులు తొక్కబడ్డ కాళ్ళు
వాటి గుర్తులు
భూమి స్తన్యంపై

శీతాకాలం
ముఖానికి అడ్డుకున్న మంచు
తుడిచేస్తూ పూర్తిగా
గుండెను కదిలించని ఆవేదనలు
దేకుతున్న పిల్లలు
చూపులు బిగబట్టి
మళ్ళా కాసేపు

బయట వేసిన ఖాళీ మంచం అద్దుకున్న శూన్యపు రంగు
ఇంకొంత నైరాశ్యం
మరికొంత వైరాగ్యం
అంతేగా ఇంకేం చేయలేవు పాచి అన్నంలో చేతివేళ్ళ దేవులాట
నువ్వు పారేసిన అధికం
కడుపులన్నీ శిలాజాలుగా
కిటికీ రెక్కలకు వేలాడుతూ
ప్రాణం మట్టిరంగేసుకుంటూ
లోపలకెళ్ళి శాశ్వత నిద్రను ముసుగేసుకుంటూ

No comments:

Post a Comment