Sunday, August 10, 2014

స్థిర

స్థిర
_____
కొన్ని నీటిచుక్కలు మొలుస్తాయి నా వేళ్ళ చివర
వాటిని ముట్టుకున్నప్పుడల్లా
ఎవరో నా మునులపై నాటి  వెళ్ళిన శబ్దం
అప్పుడప్పుడు గుండెచలమల్లో కూడా కనిపిస్తుంటాయి అచ్చుపోసిన  యంత్రమల్లె
నల్లరేగడి అంగట్లో ఇవి నడుస్తుంటాయి చూడు
కడుపారా ఆలింగనం అంటే అదేనేమో

కొన్నిసార్లు 
కళ్ళవుతాయి 
కన్నీళ్ళవుతాయి 
మాటలవుతాయి 
మాటలు కడగని భావాలవుతాయి

ఇవాళ ఇక్కడ ఇంటి ముందరి ఆకులపై శిశివులయ్యాయి
ఏంచేద్దాం మెల్లగా పాకుతూ నేల ఉయ్యాల్లోనూ కనురెప్పల కిందానూ 
మనసు గది కడిగినప్పుడల్లా చిక్కని ధూళితో మమేకమవుతాయి చెమట పన్నీరుగా
ఆలోచనల్లో గడ్డకట్టి ఘనీభవిస్తూ మళ్ళా మళ్ళా మెదడు గూళ్ళలో పడిలేవని శవాలు

అద్దం ముందు నిలుచున్నప్పుడల్లా నా ఎదురుగా జారుతుంటాయి రెండుగా 
పరావర్తన శకలాలుగా
రాత్రంతా కనబడకుండా పొద్దున్నే పోగొట్టుకున్న మంచుముద్దలుగా కాళ్ళ కింద కూర్చుంటూ
గుచ్చే పసిసూదులు ఇవే

పాళీ కదిపినప్పుడల్లా అక్షరాల మధ్యంతా జారిపడే గుర్తులు
మూసిన కవనంలో తెరిచి ఉంచిన జ్ఞాపకలవుతాయి
నిన్నూ నన్నూ నడిపించే ఆత్మలు
కొన్నాళ్ళుగా నుదురుని మెలివేసిన అనిశ్చిత కంకెలుగా రాలుతూ 
నాలో అస్థిర నివాసం

No comments:

Post a Comment