Thursday, August 7, 2014

A Complete Vauum

కిటికీ చువ్వల మధ్యన ఒక మెడ 
బయటకు లోపలికి కదలకుండా 
నిర్వచనాలు మాత్రం చాలానే రెక్కలకు వేలాడుతూ 

చెవుల విసినికర్రలు కాగితపు కొమ్మలు 
నిర్వీర్యమవుతున్నకొంత గాలి 
అద్దంలో పళ్ళు చూసుకుంటూ చంటాడు
అమ్మ చెంగు సముద్రం 
ఓ పిడికిలి ధైర్యం 

కుంపటిలో ఎర్రరంగు కణికలు
వెలుపల పండుకళ్ళలో ఉడుకుతున్న ఎసరు 
పాత్రలో ఒలికిన అమృతం 
నాలుక నదిగా పరివర్తనం

ఇంక గట్టు కింద కాళ్ళు పెనవేసుకున్న నల్లరేగడి పువ్వు
వ్యాపించిన సుగంధం మనసువీధి గుండా పొర్లుతూ
పొద్దున్నే నుసులయ్యే కలలు 

వాకిట్లో పారబోసిన సూర్యుడి తుమ్ములు 
కల్లాపిలో వెలుగుతున్న పసిబంతులు 
ఒక కేక సుదూరంగా సాయంకాలం అస్తమయమవుతూ 
వెళ్లనని మారం చేస్తున్న సమయం 

నిశ్చలంగా కిటికీ తలుపుల మూత
చువ్వల మధ్యన ఖాళీ ఇంకోసారి

No comments:

Post a Comment