Saturday, August 23, 2014

పూర్తికాని సంభాషణ

సగం తెగిన మాటలు నీలో నాలో ఉండేవేగా ఎప్పుడూ
భావాలు వేరంతే
నేను తీరిగ్గా ఉన్నప్పుడు నువ్వకడికొచ్చి కొంత ఖాళీని పూడుస్తావు
కాస్తంత తడి చేస్తావు ఓపిగ్గా
ఇంటిముందు నిలబడ్డ పూలూ నవ్వుతాయి మళ్ళీ అప్పుడు
ఇప్పుడు కొన్ని మౌనాలను మిగుల్చుకున్నాం అంతేగా
చాలా కాలమైంది మాటలు పంచుకుని
ఏ అర్థరాత్రో తెరలు తెరలుగా కళ్ళ మీదకొస్తావు
మనమిద్దరం ఎదురెదురుగా కూర్చుంటాం అచ్చూ గాలినింపిన కంచాల్లా
నువ్వు నన్ను చూడ్డం నేను నిన్ను చూడ్డం
మళ్ళా కాస్త కొత్తదనం
మనలో కాదు
మనల్ని అక్కడ ఉంచిన సమయాల్లో
అప్పుడు వేళ్ళన్నీ గోడ మీద పాకే బల్లులే అవుతాయి దూరంగా ఉండి తాకలేక
ఇక అప్పుడు మొదలెడతాం బాగోగులు
ఏంటి ఈమధ్య కనబడడమే లేదు
...ఉన్నానుగా  ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ

ఫక్కున నవ్వు నీలో
...ఏమైంది అబద్దాన్ని ఏం పాతలేదే నేను

ఎదురుచూడ్డం అంటేనూ
ఇప్పుడెవరూ ఉండరు అలా ఇంకొకళ్ళ కోసం
...నే చెప్పేది నమ్మలేవులే
కొత్త గోడలు పాతబడాలి పగుళ్ళు తెలియాలంటే

సరే సరే నమ్ముతున్నానులే చెప్పు
...బోళ్ళు ఉన్నాయి బుర్రలో నీదగ్గరికొచ్చేప్పుడు
ఇప్పుడు గుర్తుకు రావడంలేదు

ప్రేముంటే ఏమీ మరచిపోవు..
నన్ను పడదోసిన నీ మాటలు
....ఆ ప్రేమలో ఇవన్నీ మునిగిపోయాయి నమ్మవే చెబుతుంటే

ఆపు దగ్గరకి రా ఇలా
..రాయి "లా"
అవును నేనదేగా
పూర్తవ్వని సంభాషణ మనది 

No comments:

Post a Comment