Wednesday, August 6, 2014

మట్టిపురుగు

అక్కడొక వృక్షం
ఇప్పుడు పడుకుని
చేతులు కాళ్ళు ఎవరో కొట్టుకు పోయారు

భుజం మీద తన గుర్తులు
చెరపలేని పుట్టుమచ్చలు
మట్టి తవ్విన శబ్దం
చెవుల్లో గిరిగీలు తిరుగుతూ

దోసిట్లో కొన్ని నీళ్ళు
ఎవరో పోసినట్టు
పొత్తికడుపు అదిమిన ఆత్మీయ స్పర్శ
కళ్ళముఖంలో చెమ్మ
కాండం మీద కూర్చున్న పిచ్చుక పిల్లలు
రెప్పలను గాలితో కడుక్కునే దృశ్యం

నడుస్తూ తోటప్రేమ
చుట్టూ చుట్టుకున్న పాముల వేర్లు
అందమైన మట్టి పురుగులు
పెదాలపై పాకుతూ
నీకొక అనుభూతి చూసిన ప్రతిసారి
మిగిలిన నల్లసున్నం

ఆకులదీపాలు పచ్చగా మెరుస్తూ
హత్తుకునే ఉదయాలు
బాధను జీర్ణం చేసుకునే ఒక నవ్వు
చెక్కని ఒళ్ళు పేళ్ళుపేళ్ళుగా
అన్ని సమయాలు
తడిచేసే మనసు హస్తం
కొన్నిసార్లు కళ్ళలో
ఇంకొన్నిసార్లు మనసు సమాధుల్లో

కడుపు నిండిన తృప్తి భూమిలో
ప్రసవం వాననీళ్ళు
ఓ విత్తనం మళ్ళా ఇప్పుడు తల తెరుస్తూ 

No comments:

Post a Comment