Wednesday, August 27, 2014

దీపం అంచు

కొన్ని దీపాలు వెలుగుతుంటాయి ఎడారిలో పోసిన ఇసుకలా
అవి నీలోకి నాలోకి చేరుతుంటాయి కంటి రేణువులుగా
రాత్రి ఎప్పుడో తగలబడ్డ చీకటికి జరిపే అంత్యక్రియల్లో ఇంకుతున్న చమురు చిమ్నీల్లా 
రెప్పలూపుతూ నిలబడ్డ ఒక చెట్టు తనను శిశిరంలో నరుకున్నప్పుడల్లా

ఇక అప్పుడు నేను నడుస్తున్న దారెంట నిటారైన స్తంభాలపై వేలాడుతున్న కరెంటు దండెంపై తమను ఆరేసుకున్న కాకుల పార్థివాలు నా ముందు పడ్డప్పుడు చూస్తాను ఒకసారి అన్నిపక్కలకీ
ఎవరు విసిరేసారా ఈ వెలుగును అని

చెర్లో తోడే చేదబొక్కెనలో ఊగుతున్న నీళ్ళు తళుక్కుమన్న శబ్దంలో కనబడ్డ ప్రశ్నార్థకాలు
చెరోపక్కకీ దూకిన ప్రతిసారీ కొన్ని కిటికీలు తెరుచుకుంటాయి కళ్ళ రెక్కలుగా
గదిలో వలయాలుగా తిరుగుతున్న గాలి ఉన్నట్టుండి ఆగి పడుతుంది నా పక్కనెక్కడో

కులాసాగా ఒక పలకరింపు బయట నన్ను ఆరేసుకున్నప్పుడల్లా మెరవడం బాగుంటుంది
విరిగిన అగ్గిపుల్ల నెత్తిమీద పెట్టుకుని నవ్వినట్టు
ఏ క్షణమో నువ్వూ నేను రాలిపోతాం భారరహితంగా
ఆ లోయలో పూల వాసన ప్రతిచోటా పెల్లుబుకుతూ తిరుగుతుంది
ఇంకొన్ని దీపాలు మట్టిపైన కూర్చుంటాయి తాపీగా.

No comments:

Post a Comment