Tuesday, July 1, 2014

ఇంకొన్ని

కొన్ని క్షణాలు
కొన్ని గంటలు
కొన్ని పగళ్ళు
కొన్ని రాత్రులు
నిర్వచించలేని అనుభవాలను మిగులుస్తాయి

మళ్ళా ఇప్పుడు వాటిని వెనక్కి తోడుకుంటూ నూనె పాదాలతో ఒకసారి నడవాలి నాకు నేనుగా

దారపు పోగుల్లా సాలేగూడులో అల్లుకున్న మరికొన్ని జ్ఞాపకాలు
ఈరోజిక ముఖం కడుక్కోవాలి కొంచం కొత్తగా

కొన్ని భావోద్వేగాలతో రమిస్తూ నిన్ను మళ్ళీ కంటున్నాను నాలో నిశబ్దంగా

వేదంలా తోస్తావు కొన్ని క్షణాల్లో నాగురించి అన్నీ తెలిసినట్టు
ప్రతి నీ పేజీలో నా పేరును వెతుక్కుంటాను నువ్వు లేనప్పుడల్లా

ఇప్పుడు మళ్ళా కళ్ళలో ఇంకిపోయిన భీడు బావులేవొ మొలకెత్తుతున్నాయి
చాలా కాలం తరువాత కొత్త ఆశలకు పునాది.

1 comment:

  1. వేదంలా తోస్తావు కొన్ని క్షణాల్లో నాగురించి అన్నీ తెలిసినట్టు ...
    ప్రతి నీ పేజీలో నా పేరును వెతుక్కుంటాను నువ్వు లేనప్పుడల్లా ...

    ప్రేమికుల వేదన అంతరంగం ...
    చిక్కగా ... చక్కగా ...

    with regards ...


    ReplyDelete