Tuesday, July 15, 2014

కురిసే ఎండ


ఇప్పుడొక రాత్రి కావాలి చీకట్లో రాసుకోవడానికి
పగటి పలకపై దిద్దుకున్న కొన్ని ఆశలు నిశిగర్భంలో కుప్పపోయడానికి
వానకు రాలి కిందపడ్డ నలిగిన కొన్ని పువ్వులు ఇంటి గేటుకు అవతల నీళ్ళను మోస్తూ శ్రమించే ఆ మృదుత్వాన్ని తాకే కొన్ని చేతులు కావాలి
వానపాములను కళ్ళతో ముద్దాడే హృదయం ఒకటి చెక్కాలి
కప్పల సంగీతం పోసుకునే చెవులు మిణుకుమనాలి మళ్ళా ఒకసారి

పద వెడదాం మట్టిలో దొర్లే శరీరాలను వడపోసుకుతేవడానికి
పచ్చి మొక్కను కౌగిలించుకునే తడి మనసును తోడుకోవాలి నాలోంచి
ఎండుపూల పరిమళాలను దోసిళ్ళ సంచుల్లో ముటగట్టుకుపోవాలి
అరికాళ్ళు కాలే తెల్లటి ఎండ కురవాలి మధ్యాహ్నపు పొదుగులో

తాబేళ్ళను ఎత్తుకునే పెదవులు కావాలి నాచుఅందంలో
ఒళ్ళంతా పాకించుకునే ఆర్ద్రత తొణకాలి
ప్రతిసారి ఓ మబ్బు కదలాలి కరిగి దూకే చినుకుల కోసం
ఆకాశపు చెట్లు మొలవాలి ఇక్కడంతా మనల్ని మళ్ళీ పుట్టించడానికి



1 comment: