Sunday, July 13, 2014

సజీవినే


నేనింకా బ్రతికే ఉన్నాను నాలో గాలినీడల్లా
కొలిమిలో కాలుతున్న బొగ్గు కణికల్లా
ఎప్పుడో విసినికర్రతో బామ్మచేతుల్లో పుట్టిన నలుసు వాసన ఇంకా తడారలేదు
స్వేచ్చను గుండె కొప్పుల్లో నుండి విసిరేసేవరకు సజీవినే
నన్ను నేను బద్దకంగా తోసుకున్నపుడు వెన్నులో ధైర్యపు వెన్నెల పరుచుకోకపోదు
బజారు నిండా నా చూపులు నడిచినప్పుడు చేతులకు చెప్పులేసుకుని పరుగేట్టేన్తవరకు
కాలం ఒక ఇంద్రజాలం ప్రతిరోజూ వింతే
మరునాటికి రోతే మరిచిపోయినా గుర్తున్నా
తొలిచూలు నా ఆలోచన కడపాన్పు నా మరపు
వేకువే జననమయ్యాక సందెవేళకు ఇంత పున్నమిని పళ్ళెంలో కలుపుకుని మరణిస్తాను ఆణువణువూ నేనవుతూ  జీవిస్తాను
వానరాలు ఉయ్యాలలూగుతూ కనిపించే ఒకానొక అందమైన దృశ్యం కళ్ళలో పోసుకున్న  చంటోడిని
ప్రకృతిని మింగిన పెద్దోడిని పరాకాష్టకు అర్థం చెప్పే  ముసలోడిని
ఒంటికి గంటలు కట్టుకు తిరిగే నిశాచరాన్ని మింగేసాక సంపూర్ణమైన సరిహద్దుల్లో కణాన్ని చూసినప్పుడు మళ్ళా బ్రతికే ఉంటాను
ఇప్పుడింకా బ్రతికే ఉన్నాను నిర్జీవిగా

No comments:

Post a Comment