దట్టమైన పొగమంచు కింద నా కాళ్ళు వేస్తున్న చిత్రాలు
ఘనీభవించి పగిలిన గుడ్డు పెంకుల్లా కళ్ళు
వేటినో చూడడానికి కష్టపడుతున్నాయి ఆ అరణ్యంలో
అమ్మ అయిన ఓ అడవి అప్పుడే ఒళ్ళు వంచి కూర్చుంది
చెట్టుగా మారి దాని ఒడిలో నీడను తాగుతూ నేను
శీతోష్ణాన్ని తట్టుకోలేక ముడుచుకున్న శరీరం
ఒరుసుకున్న చర్మం పొరలు పొరలుగా జుట్టు అల్లుకుంటూ
చేతులు చాపిన దృశ్యం
తాపలు విరిగిన భావనమొకటి కుప్పకూలిపోయే
ఒలికిన ఆ ప్రేమలో ప్రసవించిన కాంతులు
పచ్చని మేఘాలు దీపస్థంబాలై అక్కడ కూలబడ్డపుడు
తెల్లగా మారిన రక్తంలో నిన్ను వెతుక్కుంటూ ఎవరో రావాలి
ప్రక్షాళనకు పనికిరాని మంచంకోళ్ళు నీ క్రింద
అది నువ్వేగా
గాఢత తగ్గిన చూపుల వేళ్ళు ఇంకెవరినో ప్రతిబింబిస్తూ
వయసు మళ్ళిన నీళ్ళ చప్పుడు రాత్రిని సెలయేరుగా కోస్తూ
శిధిలమై ఉదయపు నీరెండను పలకరిస్తోంది
మరణానికి చాడీలు చెప్పే జననం ఆత్మగా మారి
నీలో చేరి కెలికిన జీవితం మిగిల్చిన గంధం
No comments:
Post a Comment