Wednesday, July 16, 2014

my rain


ఒకరోజు వర్షానికి ఇల్లు తడపాలనిపించినట్టుంది­
పైకప్పు సందుల్లోనుంచి కొన్ని చినుకులు రాలిపడుతున్నాయి కొబ్బరాకులు ఒళ్ళువిరుచుకోగా

అప్పటికే ఇంట్లో ఉన్న తపాళ నిండింది ఆ వానతో
పేడతో అలికిన నేల కావడంవల్లేమో ఓ రకమైన సువాసన
నులక మంచంపై కూర్చున్న నేను,నన్ను మోస్తున్న మంచం కోళ్ళు

సరే కాసేపలా బయట చూరు కింద నిండిన శూన్యాన్ని పలకరిద్దామని వెళ్ళాను
చూరులో రెండు వాసాల మధ్య కుక్కిన కొన్ని ముతక కాగితాలు
అవెంటో చూద్దామని నా చేతి మొదళ్ళు వాటిని అందుకున్నాయి
వాటిని విప్పిచూడగా కొన్ని వయసుమళ్ళిన అక్షరాలూను,అర్థమయ్యి­ కానట్టు పదబందాలు

తడిమి చూసుకున్నానో నన్నునేను
ఎప్పుడో నేను ఒలకబోసిన దస్తూరీనే అది
అప్పుడెప్పుడో రాసుకున్న కొన్నిజ్ఞాపకాలు,లోలో­పలే దాచుకున్న అనుభవాలూను

కొన్ని నిరంతర వాహినులేవొ నాలో ప్రవహిస్తున్నట్టుగా తోస్తోందీక్షణం
ఇప్పుడు మళ్ళా ఇంటిని ఆరబెట్టుకోవాలి తృప్తి నిండిన కళ్ళతో

వర్షం వెలిసింది ఇప్పుడే
ఇంక కొన్నాళ్ళు బ్రతకొచ్చు ఈ ముతకవాసనతో...

No comments:

Post a Comment