Monday, June 30, 2014

అర్దావయవం

నీ చేతులిక్కడ తెగిపడ్డాయి చూడు
అరచేతుల్లో గీతలిప్పుడు మఱ్ఱి ఊడల్లా తిరుగాడుతున్నాయి

అక్కడెక్కడో పారేసుకున్న ఎర్రదనం కొన్ని చోట్ల చూస్తుంటావు
పువ్వుల్లోనో
అస్తమించే ముసలి సూరీడులోనో
గుండెగోతుల్లో గతుకుల మురికి బయట ఎవరి మీదో

కస్తూరి దుర్గంధం మాటల ఉద్యానవనంలో
ఏరుకుంటున్న బండరాళ్ల కొసరు
కడుపులో ఆకలి దేవులాడుతున్నదేంటో అగుపించనే లేదు
ఎరువు వేస్తూనే కూర్చున్న నగ్న కళేబరం

ఇంకోసారెప్పుడో ఊరిచివర కొన్ని జీవాలు పుడతాయి మరణిస్తాయి
ఉదయం సాయంత్రం /పూల మెడలు విరిచేసారు నీలాగే ఇంకెవరో
ఇప్పుడు మళ్ళీ అంటుకట్టాలి చీడలు పట్టకుండా ఈసారి

అక్కడక్కడా నా అవయవాలు విడివడుతూనే ఉన్నాయి
నాట్లుగా  గుండె పోట్లుగా
ఆలోచనలు కాలపు వేశ్యలయ్యాయి
స్వచ్ఛంగా ఉచ్ఛ్వాసలొదిలాక 

Sunday, June 29, 2014

అ(నిశ్శబ్ధం)


1/నువ్వు నేను
రెండు శరీరాలు పక్కపక్కగా పడుకున్నపుడు నా చేతులు లతల్లా నిన్ను అల్లుకుంటాయి నువ్వు నాలో బంధీవి కావు ఓ బాంధవ్యంలా

2/నేను నీ ముఖాన్ని ఓ పసికూనలా అరచేతుల్లోకి తీసుకున్నపుడు నీ వెచ్చని శ్వాసకు నా కనురెప్పలు వాలిపోతుంటే
సహస్ర ఎడారుల్లో అప్పుడే తిరుగాడి అలసిపోయిన ఓ బాటసారిలా నేను నీ కౌగిళ్ళలో సేద తీరుతున్నట్టుగా

3/నా రెక్కలను అదిమినన్ను గట్టిగా హత్తుకున్నావు చూడు
క్షణాల్లో చనిపోవడం అంటే ఇదేనేమొ

4/నా ప్రాణం అంటూ ఏది లేని కొన్ని నిమిషాలు నీలో ఏకమైనప్పుడు
అప్పుడు నువ్వంటావు...
నేను లేకపోతే ఏంచేస్తావని

5/అన్నం జిగురులా పెగలని నా పెదవులు ఒక్కసారిగా నిశ్శబ్దంలో బిగ్గరగా రోదిస్తుంటే నీకు వినబడేలా...నన్ను దగ్గరకు తీసుకొని నువ్వంటావు
ఇప్పుడేమైదని ఇంకొన్ని క్షణాలు నీలోనే కరుగుతానుగా అని నువ్వంటుంటే

6/స్థంబించిన ఓ చెట్టులా నేను
భళ్ళున కూలి పడ్డట్టుగా అనిపిస్తుంది

7/ఇప్పుడు మళ్ళా ఒకసారి నీ పక్కగా పడుకోవాలి కొంచం ప్రేమను పులుముకోడానికి ఈ రాత్రికి.

Saturday, June 28, 2014

అయి

ఇక చాలు నీ గురించి చెప్పుకోవడం ఆపేయ్
ఆకులూ
పూలు
చెట్లు
వేర్లు .....
ఇప్పుడేం మిగిలింది ఇంకా చెప్పడానికి

మొహానికి వేసుకున్న ఆ మాస్క్ తీసెయొచ్చు
కాలాన్ని కోసావు నీ ఇష్టం వచ్చినట్టు
బహిర్గతంగా రమించావు భావాలతో
కళ్ళను కలలతో పొడవడం అయిపోయిందా లేదా

చెలరేగి పరిగెత్తావు నేలనిండా
అడుగులను ఇప్పుడేరుకుంటావు

భళ్ళున ఉదయంలో పగిలిన సూర్యుడు కక్కుకున్న వెలుతురు నూకల్లో
నువ్వు తడుస్తావు / అప్పుడు అక్కడ పడ్డ కొంత వేడిని మరికొంత కొత్త స్పర్శను
ఆస్వాదిస్తావు నీకు తెలిసి        

ఎక్కడో ఎత్తు నుండి కింద పడతాయి నీ చూపులు
వాటితో పరిచయం పెంచుకునే ప్రయత్నంలో ప్రతిబింబాల పాట్లు

వచ్చేయ్ మళ్ళా నీలోపలికి
పారదర్శకతకు పరాకాష్ఠగా మిగులుదువుగాని
జీవితాన్ని మొత్తం తాగేసాక
ఖాళీగా శూన్యాన్ని తొవ్వుకుంటూ నిర్దయ

జానేదో జిందగికో కోయితో గాండ్ పే లాత్ మారా
ఉలిక్కిపడి ఒలికిన కాలం
ఎత్తుకుంటూ దాచుకోడానికి మానేయ్
పడుకో నీ స్థలంలో నువ్వే మట్టిని తోడుగా కప్పుకుంటూ

తెలియని నిర్మాణం


ఈ ఉదయపు నీరెండలో కొన్ని పచ్చని కాంతులేవొ చెట్ల కొమ్మల గుండా ప్రసరిస్తూ
వాటి ఆకులపై సున్నితంగా కూర్చున్నాయి

అప్పుడే కళ్ళు తెరిచిన కొన్ని పిచ్చుకలు
గూటి కిటికిలోనుండి తల బయటకు పెట్టి కంటున్నాయి అప్పటిదాకా కనని కొత్త లోకాన్ని

ఇసుకరేణువుల్లాంటి వాటి కనుపాపల్లో ఎన్ని ఆశలో రోజూ కొత్తగా ఎగరాలని
కొన్ని రోజులను వాటి రెక్కలకింద పాతేసుకుంటూ వాలిపోతుంటాయి మబ్బుల తెరచాపల కిందుగా

ఊళ్ళు దాటి వనాలను వయ్యారంగా పరికిస్తూ కొత్త రంగులను ఏరోజుకారోజు అద్దుకుంటూ అన్వేషణ

పగిలిన బాణాలు కొన్ని గుచ్చుకోని గులాబి రెక్కలుగా చేరినప్పుడు మంచు హృదయాలను మళ్ళా కొన్నిసార్లు విదిలించుకుంటూ చేరిపోతుంటాయి చిరునామా తెలియని తీరాలకు పిలవని చుట్టంలా...

మళ్ళా ఇప్పుడొక కొత్త గూటిని కట్టుకోవాలి రాలిపడకుండా...

నూనె మరీచిక

ఇక ఇప్పుడిక్కడ కొన్ని ఎడారులు
నిశ్చింతగా నడుస్తున్నాయి ఎవరిని ఉద్దేశించని పదార్థంలా

నేలపై తేలియాడే కొన్ని నూనె సెలయేళ్ళు
సమర్థ వేగంతో ఇక ఎప్పటికి ఇంకిపోకుండా
కళ్ళ జలపాతాలు

మనసు ముచ్చట్లు
ఎన్ని శిధిలాలో అక్కడక్కడా
పరుచుకున్న కొన్ని అచ్చులు

సంతృప్తంగా కరగని కొన్ని ద్రావణపు రాత్రులు
వెన్నెల మధువులు తాగిన కొండ కళేభరాలు
దాంపత్యం అలవాటుకాని వసంతపు శిశిరాలూనూ

కొన్ని క్షణాలు వెతుకుతూ
కొన్ని క్షణాలు నడుస్తూ....
అయినా లభ్యం చేసుకోలేని
ఇంకాసిని మరీచికలు.

భ్రమణం


కొన్ని సత్యాలు తేలియాడుతుంటాయి అసత్యాలు మరుగున పడినప్పుడు
నీటిమీద భారంలేని ఆకుల్లాగా

కొన్ని క్షణాలు ఆవిరవుతుంటాయి నాణ్యమైన దివిటీలు వెలిగినప్పుడు

వాన చినుకులు చెట్ల కొమ్మలపై గంభీరంగా జారినప్పుడు నిర్వేదంలో కూరుకుపోయిన మొదళ్ళు

ఎన్నాళ్ళ జ్ఞాపకాలనో వెంట తెచ్చుకున్నట్టు కొన్ని నిరీక్షణలు అంతమవుతుంటాయి నమ్మకాలు మాయమవుతున్నపుడు

The entire world might be bounded with some fucking myth.

ఎక్కడో ఈ క్షణం.....


కొన్ని గనుల్లో నువ్వు వెతుక్కుంటావు
నీ కన్నుల్లో పాడుబడిన ఆశలకు ఆధారాలను

నిరుడు సమీకరించని సమీకరణాలు ఎన్నో
నేడు లెక్కెడుతుంటావు ఇంకొన్నాళ్ళను పోగేసుకుంటూ

వెయ్యి కత్తులను నీ లోగొంతుకలో
ఎవరో దింపారు ఇప్పుడే నింపాదిగా

చూ(తీ)సుకో అన్ని రక్తపు బొట్లకు
ఇప్పుడే వెలకట్టనవసరం లేకుండా

ఇంకా ఎన్ని నిశ్శబ్ద యుద్ధాలను కూడబెడతావు
నిప్పులు నానిన ఆ నీటిలో

మాటలను జతకడుతూ మౌనాన్ని మోసుకొస్తూ
ఎందరి ముందు నిల్చుంటావు నీది కాని చోట

ఉప్పు కణికలను ఎన్నాళ్ళు మధించాలి
తేనె సూత్రాలను చేదించడానికి

ఇప్పుడు కొత్త గనులేవో తారసపడుతున్నాయి ఈ పూట
ఇంకొన్నాళ్ళు అన్వేషిస్తాను .

ఆమె


ఈరోజు ఆమె మళ్ళీ నవ్వింది నిశ్శబ్ధంగానే నాకు వినబడేలా
కళ్ళతోనే అచ్చులు పోసింది ఇక్కడంతా

రాతి గుహల్లో అట్టకట్టిన బూజులా నేను తననే చూస్తూ

ఈ మధ్య చాలా దూరం నడిచాను ఆమెతో తెగిపడిన ఊహలను అనుసరిస్తూ

తన చూపుల చెట్టు మొదళ్ళు నాలో  దిగబడినప్పుడు స్వచ్చమైన ఊపిరితో ముఖం కడుక్కుంటాను మరోసారి

తన వక్ష సంద్రంలోకి నన్ను అదుముకున్నపుడు నాలో రేగే  కోరికలకు ప్రతీకలా కొన్ని ప్రక్షాళనలు

మళ్ళా ఒక ప్రేమ తివాచీ మీదుగా ఇంకొన్నాళ్ళు నడవాలి ఆమెతో
దేహం కోసం కాదు కొంచం సహవాసాన్ని రాబట్టడానికి

తనలోని పచ్చదనం చూసినపుడు మళ్ళీ పుడతాను చాలాసార్లు కొంచం కొత్తగా తనతోపాటు సరళంగా

ఇప్పుడు వెతుక్కోవాలి ఓసారి ఆ నవ్వును నేను నిశ్శబ్ధంగా

Thursday, June 26, 2014

అక్షరం


ఈరోజు అక్షరాలన్నీ చిన్నబోయాయి స్వచ్చమైన పదాల అల్లికలో విఫలమై

అనేక కలాలు పదే పదే కాగితం పొలంలో శ్రమిస్తున్నా
దాహం తీరక నిర్లిప్తమయినాయి

ఎందరి జీవితాల్లో హస్తవాచికలయ్యాయో తమ రూపాన్నీ చాటడం కోసం

పేర్చిన పదాలలో ఒద్దిక కరువైనప్పుడల్లా నిశ్శబ్దంగానే రోదిస్తూ

వెన్నెల వాకిళ్ళలో తేలినప్పుడల్లా
వేదనసంద్రంలో మునకలు వేసినా తోడొస్తూనే ఉన్నాయి

నిష్కల్మషమైన చేతిచూరులో ఎప్పుడూ అద్దుకునే ఉంటాయి అర్థాలహాయిని మోస్తూ

కొన్నిసార్లు ప్రేమగా
మరికొన్నిసార్లు దుఖంగా
ఆర్ద్రథగా
ఆవేదనగా
ఆవేశంగా పరివర్తించుకుంటూనే ఉన్నాయి

కొత్త పదాలను జనియిస్తూనే
కలివిడివేళ్ళు దొరికినప్పుడల్లా
కాదీ అక్షరం అంతం
మళ్ళీ రూపాంతరం మాత్రమే

స్వగతం

నీలో కొన్ని గతాలు స్వగతాలుగా నానుతూ ఉంటాయి నువ్వు లేనప్పుడు
మనసు శిధిలాల్లో నువ్వు ఇంకిపోయావెప్పుడో కెరటాల కింద కరగని మట్టిలా

నిన్ను కడుక్కోలేని నీ చేతులు నీకెదురైనప్పుడు ఓ శూన్యం నీ చుట్టూ గంభీరంగా

కొన్ని పలాయనాలు పవిత్రంగా తాగుతావు నువ్వు జ్ఞాపకాల తలుపుల వెనుకగా

చిన్నప్పుడు నీ గుప్పిట మిగిలిన కొన్ని గోళీల్లా అక్కడక్కడా గుర్తులు మిగిలే ఉంటాయి

పువ్వులకు కొన్ని సాక్షాలుగా ఈ తోట ఇప్పుడు మళ్ళీ వికసించింది

ఇంకొన్ని చెరపని గీతలు అర్థం కానివీనూ
నువ్వు రాసుకున్నవీనూ
మళ్ళీ స్వగతం మొదలు.

తెరలు తొలగిన కంకె


కొన్ని తపస్సులు మళ్ళీ పుడతాయి ఈవేళ నీలో ఇంటిముందు జల్లిన కొత్త కళ్ళాపిలా

నువ్వు కోరుకునే ఆశలు నీ హృదయ ద్వారాలు దాటకుండా గుమ్మం కిందే పాడుబడతాయి

ఇప్పుడు మళ్ళా ఇంకొన్ని కపోతాలు నేల కూలతాయి భల్లానికి ఆసరాగా
వాటి వక్షాల నుండి చిక్కని నెత్తురు చిప్పిల్లుతోంది నీ కళ్ళ వసారా పక్కగా

నువ్వు అలికిన చోటంతా తడారిపోయింది ఈ పూట
కొన్ని దివిటీలు ఆరిపోయాక మిగిలిన మసిని పులుముకున్న ఓ దేహం చితాబస్మానికి చేరువలో

రాలిన కంకెలు పోగెస్తూ అనామక గాలి వీయడం నీ మీదుగా
తదుపరి మళ్ళా కొంచం స్వచ్చంగా తపస్సు పూరించాలి

ప్రయాణం

గతాలు మనసును తడుముతున్నపుడు గుండె అరల్లో పేరుకుపోయిన జ్ఞాపకాల ధూళి

నీకోసమెక్కడో మిగిలిన కొన్ని నిరంతర వాహినిలు నిండుగా గూడు కట్టుకుంటూ

దివి ధూలానికి వేలాడుతున్న కలల నక్షత్రాలు ఒక్కొక్కటిగా రాలుతుంటే నిర్వేదాలు క్రమంలో పేర్చుకుంటూ జీవితానికి సరిపడ సంభాషణలు

మళ్ళీ నువ్వే ఇక్కడ ఈ క్షణం నిన్ను నువ్వు రాసుకుంటూ
ఇంకో కొత్త ప్రయాణం

ప్రసవం


1/గర్భం దాల్చిన నిండు మేఘాలు
చినుకులను ప్రసవించడానికై ఉరుములు

2/ఆకాశం(లో)తో ప్రతి నిత్యం రమిస్తూ మబ్బుల చాటున దినం దినం అధరీకరణం ధరణిలో కూరుకుపోవడానికి

3/కొన్ని వెలుతురుల ప్రసరణ ఈనాడు మళ్ళా
పుడమిపై సంతృప్తిగా ఓ నిట్టూర్పు

4/చెట్ల కొమ్మల మధ్యగా జరుగుతున్న పిడుగుల ప్రక్షాళన వాటి మొదళ్ళను కుదించేస్తూ

5/కొన్ని చేతులు చాపిన ఆవరణం ప్రకృతి ఒడి
ఎన్నిమార్లు ఇంకిపోయాయో గుర్తుపట్టని పదార్థాలు

6/కణాలు
ప్రతి కణాలు
అంతమవుతూ మళ్ళీ ఆవిర్భావం.

కుదించని సవరణ


1/కొన్నిసార్లు నాలోకి లోతుగా జారిపోయాక గుండె గోడల పక్కగా ఓ కన్నీటి బిందువొకటి పొడిగా రాలి పడుతుంది నిన్నా నేటికి మధ్యగా

2/అంతరాళంలో కొన్ని నిశ్శబ్ధ అణువులు నీ మౌనంలో బలయ్యాక మిగిలిన శిధిలాల వెనుక దుమ్మును మరోసారి నువ్వుగా దులుపుకుంటూ

3/రెక్కలు మొలవని ఓ పిచ్చుక కళ్ళకింద దాగిన కష్టమేదో నీ మనసులోను ఉన్నట్టు స్రవిస్తాయి నీ పంచేంద్రియాలు ఈరోజు మళ్ళా

4/దివిటీ పట్టుకుని ఎడారి సొరంగాలలో పెనుగులాట తడియారని క్షణం కోసం

5/మంచుకిరీటాలన్నీ నీవే దాచేసుకోవచ్చు కరిగిపోని సంద్రంలో తీయగా

6/ఇంకా నడవాలి కొంత దూరం మళ్ళీ ఇంకొన్నిసార్లు పొడిగా పుప్పొడిగా మారాలి

Glitters


ఈ రాత్రి కొన్ని నక్షత్రాలు
ఆకాశానికి వేలాడుతూ సత్యాలుగా కనబడుతూ/
పగలు మళ్ళా అదృశ్యమవుతూ అబద్దాలుగా పరిక్రమణం

విచ్చిన్నమో
విభజనో తట్టని నిర్జీవ పాలపుంతలు అక్కడక్కడా

ఈరోజు మళ్ళా బాల్కనిలో కూర్చోవాలి కాసేపు వీటిని లెక్కించడానికి వేళ్ళ బెత్తంతో

దండెం మీద వేసిన పాత చొక్కాలా రోజు అవే నక్షత్రాలు అటూ ఇటూ మారుతూ

ఎవరో కాసిని బియ్యపు గింజలను ఇక్కడ జల్లారు మొలకెత్తకుండా అడుగంటేవి
కనిపించకుండా కనుమరుగయ్యేవి

కూటమి మొత్తం ఒక్కసారిగా పళ్ళికిలించిందా అనంత తారాజువ్వలు ఎవరూ విసరకుండానే నింగిలో

ఇప్పుడు ఇంకొన్ని కొత్త ఆశలను స్వప్నిస్తూ ఈ రాత్రి గడపాలి నేను

ముడి దర్పణం


1/ఇంకొన్ని నేలలు ఈరోజు ఇక్కడ పచ్చిగా పరుచుకున్నాయి
ఇంకని పావురాల రెక్కల కన్నీరులా

2/గాడాంధకారంలో వెలుగుతున్న నీటి చుక్కలు
పగులుతున్న చీకటి స్పటికాలు నిన్ను మళ్ళా కమ్మినట్టు

3/తెరల ప్రాణాలు నేడు కొత్తగా తొలగుతూ పిల్లి కొండల నడుమ ఎంతకీ పూర్తవ్వని ఒక నడక

4/శిలా కళేభరాల చుట్టూ ఇంకొన్ని జీవాలు నీ చూపులు చదవనివి

5/అస్తమవ్వని కొన్ని ఉదయాలు
తెలియని రోజులకు అంకితమవుతూ తేలిక హృదయం

తడి ఎడారి


నేనూ మరికొంచం నిశ్శబ్దం గదిలో ఒంటరిగా ఒకరికిఒకరు తోడుగా కూర్చుని కొన్ని క్షణాలను కష్టంగా ఖర్చుపెడుతూ

జ్ఞాపకాల ధూళి ఉప్పు సంద్రంగా నేలంతా తవ్వుతూ కనిపించని రహస్య సొరంగాలను పచ్చని ఆకులపై గాలి బిందువులుగా శోదిస్తూ

నిశ్చలంగా
కొంచం నిబ్బరంగా
నాలో నన్ను చదువుతూ
వాడిపోయిన వెన్నెల కెరటాలు
మళ్ళీ ఎప్పుడు వస్తాయోనని
హిమపు ఆలోచనలు

ఇంకిపోయిన తేనె ఎడారులు
వెల్లువెత్తిన శిధిలాలు దివిటీ వెలుగులో కనిపించకుండా
ఇప్పుడు ఇంకా ఒంటరిగానే నేనూ నా నిశ్శబ్దం

నిశ్శబ్ద యుద్ధం...


1/పచ్చని చెట్టు నుండి ఆకులు రాలిపడినప్పుడల్లా ఓ నిశబ్ద యుద్ధం ఎవ్వరికీ కనిపించకుండా

2/కాలం మధ్యలో ఎవరో ధారగా పారబోసినట్టు కొన్ని ఆశల నిక్షేపాలు రహదారి నిండా

3/ఆకులు తమకు తాముగా కాక ఏదోక సున్నిత పాదం కింద చిట్లుతుంటాయి నొప్పి తెలియకుండా

4/ఆ క్షణం మళ్ళా ఓ సంఘర్షణ ఎవరూ ఆక్షేపించకుండానే

5/నిధులన్నీ చెత్త కుప్పల్లో గనులుగా నేరేడు నీరాజనం కొంగ్రొత్త స్పర్శలో

6/ఆ ఆకాశాన్ని ఇవాళా కూడా దులిపేదీ నీ చేతి కొనలే
మేఘాలు మోరిగినప్పుడల్లా

7/ఈ మనసు పుటాలకు ఇంకా మోజు తీరలేదు ఎన్ని మట్టి రాత్రులను శ్వాసించినా

8/మరికొన్ని యుద్ధాలు నిశ్శబ్దంలోనే...

­పాత ఇల్లు


పగుళ్ళ గోడపై దిద్దిన అక్షరాలు దుమ్ముపట్టి చిన్నప్పుడెప్పుడో నువ్వు దిద్దినవి
ఎవ్వరికీ అర్థం కాకుండా నీకు మాత్రమే తెలిసింది

భుజం మీద అంగుళం చిరుగు
ఖాళి  సాలీడు గూటిలా
సగం కొరికిన పలక ఒకపక్కగా ఎన్నిసార్లు చెరిపావో ఉమ్మితో

రాళ్ళ గుల్లేరు నేలపై ఇంకిన గువ్వపిట్టల రక్తం

విరిగిన బలపం
కొత్త భావ చిత్రాలు నా నుండి
గాలి పటాల వర్ణననలు రంగు దారాల మధ్య

ఇప్పుడు అదే గోడ మీద సున్నపు పూతలు వాటి వెనకాల చెరగని అక్షరాలు
ఇంకా నిన్ను కప్పేస్తూ ఆ ఇంట్లో

అపసవ్యం


సీసపు కెరటాలు గాజు తీరమంతా
కొవ్వుతుల రాత్రిలో కొన్ని వెన్నెల కుట్లు ఆకాశపు తెర నిండా

గాలి పొట్లాలు మనసు మైదానాన
ముఖాన అద్దుకున్న నవ్వులు

తేనె చీకట్లలో వెండి మిణుగురులు నా దోసిళ్ళలో ఒలికిన పచ్చని కాంతులు మనసు ప్రక్షాళణ కోసం

కొన్ని స్వప్నాల జననం
మరికొన్ని సత్యాల మరణం
కొత్త పునాదులు లేని పేక నిర్మాణాల సంద్రం

మధుశాలల్లో బిక్కచచ్చిన ప్రాణాలు
పాత్రలు ఇంకేదాకా
సంపూర్ణంగా అసంపూర్ణాలు మదిసమాదుల కింద

Wednesday, June 25, 2014

పేనిన పావురం


నన్ను నేను దూరంగా విసిరేస్తున్న క్షణం
నా నుండి విడిపోయి ఎక్కడో పడతాను ఎవ్వరికీ కనబడకుండా
నాలుగు రాళ్ల మధ్య ముఖం తొలుచుకుంటూ  అద్దం మీద జారే చెమట చినుకునవుతాను

నువ్విలారా అంటూ ఎవరో పిలుస్తారు కొంతకాలానికి
నిర్లిప్తతను  రువ్వుతున్న తాయిత్తు ఉన్నపళాన అడ్డుపడుతుంది
తటాలున కళ్ళలో కొన్ని సమాధులు పుడతాయి
వాటిని  కడుగుతూ కాలం  గడిపే పనిలో ఇంకొన్నాళ్ళు

ఒత్తుకుపోయిన ఈతముళ్ళు పాడుబడిన సముద్రంలో కట్టుకున్న కాంక్రీట్  పాలస్
కెరటాల గోడల నడుమ నీ శరీరాన్ని తాకుతున్న పరాన్న బ్యాక్టీరియాలు
మళ్లీ  మళ్లీ నిన్ను గుర్తుచేస్తూ పాడుబడిన జ్ఞాపకాలు ఓ పక్కన 

క్షణానికో జననం చూసుకుంటూ మరుక్షణమే మరణానికి చుట్టమయ్యే 
రేగిపూల  ఆత్మలు నీళ్ళలో కాలుతూ బూడిదయ్యే  నేను 
కొత్త గీతలకు  చుక్కలద్దుతూ ఉదయం 

పచ్చని పావురాలు  కక్కుతున్న నీలపు రక్తం పూసుకున్న ఆకాశం 
మరోసారి కిందకు దూకుతూ మిగిలిన స్థాణువులు  మిణుగురులై 
ఈదుతున్న నేల  పెల్లుబీకుతున్న కాగితపు ఆలోచనలు 

ఇప్పుడిక ఏరుకోవాలి  నన్ను నేను అన్ని మూలల్లో మూలాలుగా 



అ|­స్థిరం


చీకటి పళ్ళెంలో వడ్డించిన నక్షత్రాలు తోకచుక్కల ఆరగింపు వెన్నెల రాత్రిని మింగేస్తూ

ఊటబావిలో ఒళ్ళారబెట్టుకుంటున్న తాబేలు/ఊరి చివర దాక్కొన్న కొండచిలువ ఇష్టమైన కౌగిలింత కోసం

ఎక్కడబడితే అక్కడ పరచుకున్న నేల కళ్ళు నువ్వు చూడకుండా/ రెండు పక్కలా కొరుక్కు తిన్న తారోడ్డు

అప్పుడప్పుడు తొంగి చూస్తూ తొండి చేసే వర్షం కొత్తగా /రెక్కలు దులుపుకుంటున్న సీతాకోకచిలకలు

కొండపై తీరిగ్గా కూర్చున్న గడ్డిపురుగు కాసే పచ్చని ఎండ కోసం

మొద్దుబారుతున్న అడవి పడుచు ఎప్పటికి తడియారకుండా చాపిన ఆకుల చేతులు పద్దాకా ముడుచుకుపోకుండా

పొద్దుతిరుగుడే రాత్రికి మళ్ళా షరా మామూలే తల ఒంచేస్తూ

అంతా తెలుపే


కొన్ని రోజులు నీకు తెలియకుండానే కరుగుతుంటాయి నీ ముందే/నిజంగా నువ్వు బ్రతికావో లేదో తెలీదు
నటించినట్లుగా అ(గు)నిపించినా ఎండాకాలమేగా రోహిణి కార్తే అని పగిలిన రోళ్ళ వైపు నీ చూపులు

కాసిని సంతోషాలు మిగిలాయిలే గతాలను నేరుగా నరుక్కునపుడు అని మనసు జోబులోకి తొంగి చూస్తే అంతా ఖాళీయే నేలపై మట్టి చినుకులు ఆవిరైనట్టు

కొన్ని జ్ఞాపకాలను మూకుట్లో దాచుకున్నావుగదాని ఉపరితలమంతా సానబెట్టేశాక మిగిలిన నుసిని పొట్ట సంధుల్లో విరివిగా పారబోసి వెతుకుతావు/­అప్పుడక్కడ నిన్ను కంటూ మిగిలే ఓ శూన్యం

వేర్ల పేగులన్ని బయటికొచ్చేశాక ఇక అడుగంటిన విత్తులను చేతివేళ్ళపై పండించుకుంటూ /కోతకు రాని హిమాలయాల గురించి మలయమారుతాలరో ఎదురుచూస్తుంటావు

ఇక పాక్షికంగా కలగన్నాక తతిమా స్వప్నాలను పిండుకోగా రాలిన పుప్పొడి ప్రాణాలను పీల్చేస్తూ ఓ శ్వేత భైరవుడు/అదీ నువ్వే

ఎడారి కళ్ళాపి


నిన్న రాత్రి కొన్ని కోరికలను వేలాడదీశాను ఆశల కొక్కానికి
తుప్పు పట్టి రాలిపోడానికి సిద్దంగా ఉన్న మంచురెక్కలు

ఇంకా సరిగ్గా దర్పణం కానీవీనూ
పారదర్శకంగా ప్రసరించినవీనూ

మూడొందల అరవై డిగ్రీల్లో సదా మనసు భ్రమణం
నిశ్చింతల రేవు దాటేశాక ఆరని మోహాల మత్తులో ఈ దేహం ఇంకా జోగుతూనే

సంక్లిష్టంగా పరిభ్రమణం చెందక తెప్పరిల్లిన సరంజామా బూజు పట్టి అందవికారంగా వాంతి చేసుకుంటూ మళ్ళా పుడుతూ

నేలపై అంగుళపు ధూళి బిర్రుగా కౌగిలించుకున్నకా ఒంటి చీపురుతో అప్పుడప్పుడు ఊడ్చే ప్రయత్నం

పింగాణీల్లో హృదయాలను దులుపుకున్నాక ఎడారిలో ఒంటరిగా కళ్ళాపి జల్లుకుంటూ తడియారని తలపుల్లో ఇంకా బ్రతుకీడ్చుకుంటూ

ఇక ఇప్పుడు చీకటి పరదా తొలగింది
మళ్ళా కొన్ని కోరికలు పుట్టాలి ఈవేళ

The Banian



తనను మళ్ళా  ఈరోజు కలిశాను చాన్నాళ్ళ తరువాత ఏం మారలేదు
అవేకళ్ళు
అలానే చెక్కిళ్ళు

కొంత పచ్చదనం అక్కడక్కడా
ముఖాన గాలికళ్ళజోడు
చేతులకు ఒడిలిన గాజులూ

ఇంతకుముందు రివ్వున తిరుగుతుండేది అటూ ఇటూ ఊరంతా తనను చూపిస్తూ
అంతావచ్చి తన వాకిట్లోనే పొద్దూకులా /ఇప్పుడు వయసయిపోయాక ఒక్కళ్ళు పట్టించుకొనేవాళ్ళు లేరు

మునుపు యవ్వన్నాన్ని తనువంతా పోసుకునేది   ప్రతి వసంతానికీ /ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా

తనువు దోచుకున్నాక మిగిలిన గాయాలను తడుముకోవడంలోనే జీవితం అంతమయ్యింది
ఓనాడు లేపనమైన తను నేడు తన దేహం పైన నివురుగప్పిన పుళ్ళకి అరువడుగుతోంది

ప్రతిఅంగాన్ని పంచుకున్నవాళ్ళే
ప్రాణాలనుపోసినోళ్ళు లేరు
/కొందరికి ఇల్లయింది
మరికొందరికి ముడిసరుకయింది
అయినాతీరని దాహంతో ఇంకా వేరుచేస్తూనే

ఇకఇప్పుడేం చేస్తుంది మోడుబారిపోయాక
రాని వసంతం కోసం ఎదురు చూడడం తప్ప


చీకటి పూలు


కొన్ని ఆలోచనలు కరగాలి ఆవేశాల వెనుక

మరికొన్ని అవశేషాలు మిగలాలి ఆత్మల అర్పణం తరువాత

నిన్నల్లోని క్షణాలు నేటిలోకి అనుభవాలుగా తోడుకుంటూ బ్రతకాలి

కొన్ని చీకటి పూలు పూయాలి ప్రతి రాత్రి పగటి చొక్కా విడిచేశాక

శూన్యంలో కొన్ని అక్షరాలు
పదే పదే గుర్తొస్తూ/­గుర్తుచేస్తూ

కొన్ని పక్షులు అప్పుడేపుట్టి రెక్కలు విదల్చకుండా
కళ్ళతో లోకాన్ని వీక్షించే యత్నం

మళ్ళీ కొన్ని ఊహలు అనిశ్చితంగా
ఈరోజు నా ముందు...

అట్టముక్క


వాన చినుకులకి తడిసిన అట్టముక్క
వాటి మీద ఎప్పుడో రాసుకున్న కొన్నిఅక్షరాలు వాక్యాల ధూలానికి

పీట కింద ఏదో ముతక వాసన వేస్తుంటే బయటకి తీసాను
వృద్దాప్యంలో చలిచీమలు దాని సహవాసంలో

ఎవరో సిరా ఇంకుతో అద్దినట్టున్నారు ఆ అట్టమీద
కమ్మని పాత సుగంధం
అప్పుడెప్పుడో అమ్మ బయటపారేస్తానంటే దాచినట్టు గుర్తు

ఖాళి కుర్చీ
వాటి నాలుగు కాళ్ళు
ఎవరికోసమో ఎదురుచూస్తున్నాయి ఎప్పటినుండో/దాని చుట్టూతా ఎప్పటిదో చుట్టవాసన ఇంకా అలానే ఉంది మా అందరిమధ్యా

వరి కంకులు దులిపిన ఆ చేతులు ఇన్నిరంగులనద్దాయంటే ఓకింత ఆనందం
కుప్ప నూర్చినా
కోత కోసినా ఆ చేతులే

ఇన్నాళ్ళకు మళ్ళా నా కళ్ళలో నానుతూ
తాతయ్య జ్ఞాపకాలనుకుంట ఇంకాచెరిగిపోలేదు ఇంట్లోనూ
అట్టముక్కలోనూ
ఆ అట్టముక్క ఎప్పటికి పారేయలేదు మళ్ళీ

ఇసుక గడియారం


కొన్ని క్షణాలు కరిగించుకుంటాను నాలోకి గడియారం ముల్లుల్లోంచి
ఆ వ్యవధి చాలనుకుంట నన్ను నేనురాసుకోడానికి

సవ్యదిశలోను
అపసవ్యదిశలోను సాగే నా ఆలోచనలకు చరమగీతం ఈ రాత్రి

మౌనపు పరదాల మధ్యగా ఓ చీకటి సముద్రం
దాని ముందు మోకాళ్ళ మీద ఓ శరీరం/మళ్ళీ నేనె

దేహానికి కనబడని ఆత్మ
ఆత్మకు కనబడే దేహం
మధ్య ఓ అనామక రూపం నేను

ఇంకొన్ని రోజులు శూన్యంలోకి నడిచేశాక సంకలనం చేయలేని నల్లపిచ్చుకలు కాలపు వరండా నిండా

చిగురులు వేయని నీరుటెండలో పచ్చగా తడుస్తూ నా ముఖం(మొహం) ఆశల కాళ్ళకింద నిలబడి అన్వేషణ

బారులు తీరిన ఇసుకరేణువులు ఒకదానివెంట మరోటి దివి క్షేత్రంలో నీలపు రవిని కమ్మేయడానికి

ఇప్పుడు ఆ రెండు ముళ్ళు కలిసాయి నిర్మానుషంగా ఉన్న అస్తవ్యస్త కూడలిలో నన్ను ఓ చోటికి పోగేస్తూ/అచ్చు నాలానేఇంకోసారి

కొత్త అస్థిపంజరం



నా కళ్ళు వాటి చూపులతో నేలపై కొన్ని దృశ్యాలను రుద్దుతుంటాయి ప్రతి క్షణం
వాటికెప్పుడు ఒకేలా కనిపించే నిర్లిప్త ప్రతిబింబాలు

మసక పదాల్లో అర్థవంతమైన అక్షరాలతో కుస్తీ పడుతూ ఓ వ్రాత

శరీరంతోనూ చూద్దామని యత్నించాను చాలాసార్లు
అయినా ఎక్కడా అగుపించని కోణాలు

కొన్ని గడ్డకట్టిన కాలపు సమాధులపై శాసనాలుగా లిఖించిన శవాల గంజి
పగటి సాంబ్రాణిలో వత్తుల సుగంధం ఇంకిపోలేదింకా మనసుపుటాలలో

మౌనంలో మాటలు తగలేసినపుడు భావాలను బలవంతంగా బందిస్తూ కొన్ని శృంఖలాలు

ఇంకా ఎన్ని విస్పోటనాలు జరగాలోగుండే శివారుల్లో నిశ్శబ్ధంగా
మళ్ళీ అప్పుడు అద్దుతాను ఇంకొన్నిరూపాలను మచ్చిక చేసుకుంటూ

తెగిన మాటలను మనసు సైగల్లో అతుకులేస్తూ గాలి బుడగలు
నేను ఇన్నాళ్ళూ ఉంటున్నఅస్థిపంజరమే/ఈరోజు కొత్త దృశ్యాలను కక్కుతోంది

మట్టి వాన


నిన్న రాత్రి కురిసిన వర్షానికి
ఆరుబయటంతా ఒకటే మట్టి వాసన
ఎంత ఆపుదామన్నా గుండె పుటాల్లో జ్ఞాపకమై కూర్చుంది

పచ్చి ఆకులు ఒంటి నిండా తడిసిన తన్మయంలో ఓ తేనె పులకింత

అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా తట్టి వెళ్ళే వసంతంలా ఓ పులకరింత

కారుమేఘాల మధ్య భళ్ళున ఓ శృతి మనసుకినసొంపుగా యదలోతుల్లో మరోవాటిక

రెక్కలు రాలిన పువ్వులెన్నో ఒంటరిదారి నిండా పరుచుకొని
ఈవేళ తృప్తి చెందాయి ఈ వానకి

చీకటి ముసుగును అప్పుడే తొలగిస్తూ ఆకాశం ఇంకిన చినుకుల్ని రుచిచూపిస్తూ

దోసిళ్ళలో కాసిని ఇప్పుడే స్థిమితపడ్డాయి రహదారులన్ని కురచయిపోయాక

చిన్నప్పుడు వేసిన కాగితం పడవలు ఇంకా ఎక్కడో తిరుగాడుతున్నట్టుగా ఓ మధుర సంతకం ఈ వర్షంలో

మళ్ళా ఎప్పుడో గగనాన మేఘమధనం
నా కళ్ళలో కొట్ల విత్తనాలు మొలకెత్తడానికి
ఎదురు చూస్తూ

Friday, June 20, 2014

రెప్పల కిటికీ


కిటికీ బయట ఒళ్ళు విరబూసుకుని పడుకున్న చీకటి
రాత్రిని ఎక్కువగా తాగినట్టుంది
ఒకటే మత్తు వాసన

నక్షత్రాలు కూడా తమ శరీరంలో ఖాళీలను నింపలేనంతగా తయారయ్యింది

కొండలు
చెట్లు
ఆకులు
పువ్వులు
అడవులు చిక్కగా మునిగిపోయాయి
చేతులు కాళ్ళ నిండా నల్ల రక్తమే

నా కళ్ళు ఎంతసేపు అద్దుకున్నాయో రెప్పల తలుపులు మూసేశాయి రాత్రి ఎప్పటికో

ప్రొద్దున్నే నే లేచాక చూసిన తెల్లటి ఉమ్మెత్త పూల నురగ అక్కడంతా/ఇంతలా నిండిన చిక్కదనం మాయమయ్యాక ఇక ఎప్పటికీ నమ్మబుద్దికాలేదు నాకు

నాకు తోడుగా ఉంటుందనుకున్న పదార్థమేదో కొత్త రంగేసుకుపోయాక మిగలాలనిపించలేదిక్కడ

పచ్చికలన్నీ ఏడ్చి ఏడ్చి తమ శరీరంపై నీళ్ళ బిందువులయ్యాయి ఈ క్షణం/కణాలన్నీ కదలలేక మెదలలేక ఒంటరి యుద్ధంలో పావురాళ్ళై నేలకొరిగాయి

ఇక ఎప్పుడూ ఎదురుచూడలేదు మళ్ళా కరిగిపోయే దానికోసం

Wednesday, June 18, 2014

అవే కళ్ళు

The unpredictable only substance may view you sometimes... Let them Let it allow....Life goes and flows కొన్నిసార్లు జీవించాలనిపించడం సహజమేనేమో ఏ ఆత్మకైనా ఆత్మాభివృద్దికి కారణమైన విత్తనాలు జీవితంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి తనపై కూర్చుని విర్రవీగుతున్న కాండపు ఆకుల్లాగా వేర్లు లోనెక్కడో దాక్కొని పైకిమాత్రం డాబుగా కనిపించే వృక్షం కూడా ఏదోక క్షణాన నేలకొరగాల్సిందేనేమో జీవన పయనంలో కొన్ని మజిలీలు గురువులుగా నీ ప్రక్కగానే వెడలిపోతుంటాయి నువ్వు గుర్తుపట్టలేనంతగా విజయమో అపజయమో నిబద్ధతను నేర్పిన చేతులు మళ్ళీ కనబడకుండా ఎవరో ఒకరు చెప్పాలి మనకు ఆ ఆనవాళ్ళను నువ్వు కూడా చూశావని అప్పటి వరకు దుమ్ము పట్టిన గత అనుభవాలన్నీ మరుగున పడుంటాయి నీ వెనకెక్కడో నిలుచుని వీపును తడుముతుంటాయి నువ్వు ముందు నిలబడేందుకు కాని స్వయంకృషి రక్తంపైన నరాల క్రింద దాచుకున్నట్టుగా ఒక నిషా ఇప్పుడు అవే పాత కళ్ళు నీకెదురుగా అక్షరాలు దిద్దిస్తున్నాయి మళ్ళాఒకసారి

Tuesday, June 17, 2014

చీకటి పిదప

చీకట్లో నవ్వే నక్షత్రాలు/ కొన్ని కలలు కరగాలి కళ్ళ నిచ్చెనల పైనుండి తలపులన్నీ తపనలుగా మారి జీవించాలి సజీవ సమాధులపై మరోసారి నిర్జీవంగా నడవాలి రెక్కలు విదిల్చిన ఆకాశం/ తడిసి ముద్దవుతున్న ధాత్రి పగటి వెలుతుర్లు పడమరకెళ్ళాక మబ్బుల మాటునుండి తనను బయటపెడుతున్న చందురుడు అలుపెరుగనిరెక్కలు/ కొన్ని పక్షులు మళ్ళీ ఎగరాలి నింగి సరిహద్దులు దాటి పడిలేచే కెరటాలే/ పదే పదే సంద్రంలోనే తలదాచుకుంటూ ఇప్పుడు ఇంకొన్ని కొత్త వస్తువులు కొ(క)నుక్కోవాలి ఏకాకిగానే

Sunday, June 15, 2014

అట్టముక్క

వాన చినుకులకి తడిసిన అట్టముక్క వాటి మీద ఎప్పుడో రాసుకున్న కొన్నిఅక్షరాలు వాక్యాల ధూలానికి పీట కింద ఏదో ముతక వాసన వేస్తుంటే బయటకి తీసాను వృద్దాప్యంలో చలిచీమలు దాని సహవాసంలో ఎవరో సిరా ఇంకుతో అద్దినట్టున్నారు ఆ అట్టమీద కమ్మని పాత సుగంధం అప్పుడెప్పుడో అమ్మ బయటపారేస్తానంటే దాచినట్టు గుర్తు ఖాళి కుర్చీ వాటి నాలుగు కాళ్ళు ఎవరికోసమో ఎదురుచూస్తున్నాయి ఎప్పటినుండో/దాని చుట్టూతా ఎప్పటిదో చుట్టవాసన ఇంకా అలానే ఉంది మా అందరిమధ్యా వరి కంకులు దులిపిన ఆ చేతులు ఇన్నిరంగులనద్దాయంటే ఓకింత ఆనందం కుప్ప నూర్చినా కోత కోసినా ఆ చేతులే ఇన్నాళ్ళకు మళ్ళా నా కళ్ళలో నానుతూ తాతయ్య జ్ఞాపకాలనుకుంట ఇంకాచెరిగిపోలేదు ఇంట్లోనూ అట్టముక్కలోనూ ఆ అట్టముక్క ఎప్పటికి పారేయలేదు మళ్ళీ

Saturday, June 14, 2014

మరో


మట్టిలో నేను
నాపై మట్టి
కొత్త వడగళ్ళు నా శరీరానికి చలిమంట వేస్తూ

తుమ్మ ముళ్ళ కరచాలనం రక్తపు శివార్లలో

చిత్తడి నేలలో నా అడుగుల స్నానం ఎంతసేపో
తెలియకుండానే తడారడం ఇంకా గుర్తే

కాసేపు భూమి సూర్యుడితో ఎంగిలిపడ్డాక
తనను ఆకాశపు కొళాయి క్రింద పరచుకుంటున్నప్పుడు
నా చుట్టూ అలుముకున్న చతురస్రం

కపాలంలో  కొత్త మలుపులు వెతుక్కుంటూ నా ఆలోచనలు మస్తిష్కపు సంధుల్లో సేద తీరుతుండగా అరువు తెచ్చుకున్న రాత్రిలో పదునుగా నన్ను కోస్తూ

చితిబజారు నుండి విసిరివేయబడ్డ కార్బన్‌ గోళాలు స్వేచ్ఛగా నా ముఖంపై దొర్లుకుంటూ

నన్ను ఐక్యం చేసుకునేందుకు  కాటుకదడి తెరుస్తూ మూస్తూ

Friday, June 13, 2014

అర్థాల వసారా

పదాల మేడల్లో నేను ముడుచుకొని కూర్చున్నపుడు వాక్యాలు నీ చుట్టూ లతలా అల్లుకుంటాయి

అర్థాల సమాధులపై దులిపిన భావాల దుమ్ములా నేను
నేల పగుళ్ళలో గాలిని నింపి కొత్తపూడికలకు శాంతి స్థాపన చేస్తూ నువ్వు

నీళ్ళను మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఒడిలిన రెండు చేతులు
రంగుల కొవ్వుత్తులను కొత్తగా వెలిగించడం కోసం

ఆశల బావుల్లో ఎన్నిసార్లు తొంగిచూసినా కొత్తగా కనబడదే
ఎప్పుడూ పాత నీడలే

మునుపెన్నడో నేశాను
అంతరంగ పరికిణీని
ఇంకా ఏ కలలు తొడుక్కోలేదు
ఎండిపోయిన పూల సుగంధంలా
నా కళ్ళు తడారుతుంటాయి ప్రతిరోజూ

నా గదిలో శూన్యం కనిపించిన ప్రతిసారి చెబుతుంటాను కాస్తంత ఖాళీ ఉంచమని నేనొచ్చేదాకా

మనసు గుహల్లో ఎన్ని శవాలో
ప్రతి నిత్యం కాలుతుంటాయి నిర్వేదానికి ఒత్తాసులా
చెక్క తలుపుల మధ్యన ఓ నిండు సువాసన తెరచిమూసినప్పుడల్లా

వసారాలో ఒంటరి ధూలాలు
చెదలతో రమిస్తూ
వర్షం పలకరించినపుడల్లా ఒళ్ళుతడుపుకుంటూ కొంత మట్టివాసనను లోలోపలకు తోడుకుంటూ

మరికొన్ని అక్షరాలు నగ్నంగా నానాలి కొత్త అణువుల శోధనలో

Thursday, June 12, 2014

thread way


మళ్ళీ ప్రయాణించడం పాతరోడ్డుపై నన్ను నడిపించుకుంటూ
మట్టిలో మునిగిన నౌక ఒకటిప్పుడు గాయాల తెరలకు కొట్టుకుపోయిన జ్ఞాపకం

దిశాబాణాలు ఓ చివరన తమ కళ్ళను పదును పెట్టుకుంటున్న శరాలు

కూర్చున్నచోటే నీకు కొన్ని నిర్దేశాలు కళ్ళకు అడ్డుపడుతూ
తలక్రిందులుగా చెట్టు భుజాలకు వ్రేలాడుతూ సన్నని ఆకుదేహాలు

ఇంకో దారం నీ చిన్న చర్మానికి గతుకులు కుడుతున్న శబ్ధం
ఆకరుకంటా రెండు రహదారులు నా ముందు ఖాళీ ముఖంతో

ఇంకా తడారాలి పచ్చికపై ముద్రలు నా కళ్ళలో అతుక్కోవడానికి

ఖాళీ

నాలోకి తొంగి చూసాను లోపలంతా శూన్యమే తెలియని డొల్లతనాన్ని పూడ్చడానికి ప్రయత్నించాను నా ఆలోచనలన్నీ నన్ను వీడి సుదూరంగా ఎక్కడికో వలసపోయాయి నన్ను కాదని బహుశా వాటికి కూడా మనసు సాంద్రత తెలిసినట్టు లేదు కటిక కిరణాల కింద తడుస్తున్న దర్పణంలా నేను/ఎంతకీ వక్రీభవించని కొన్ని ఎడారి పూలు మండుతున్న చితిలో నిశ్చలంగా ఒళ్ళు కాల్చుకుంటున్న ఓ శరీరం/ పాకుడురాళ్ళపై నిశ్శబ్దంగా కొన్ని నీటివిత్తనాలు ప్రతి క్షణాన్ని పారేసుకున్న ఒంటి గడియారంలా కొన్ని ప్రవాసాలు నా చుట్టూ

Wednesday, June 11, 2014

సమాధి కింద

వెన్నెలను మీద పోసుకున్న కెరటాలు నిత్యం తడుస్తూ కొన్నివేలమార్లు పుడుతూ 

 నీటిలోకి దూకిన కాంతి బొంగరంలా ఎంతదూరం వెళ్ళిందో ఓ చూపు కొలుస్తూ 

 బస్సు కిటికీలోంచి నా కనురెప్పలు విడివడి బయటెక్కడో పడతాయి కొబ్బరాకులపై కూర్చుంటూ 

 తెగిపడిన నా ఆత్మలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఏరుకోలేనన్ని 

 ఏమో ఎన్ని కొండగోతుల్లో డొక్కలు పగిలాయో నిత్యపు మైనం కాల్చిన రక్తం నా అస్థిపంజరం గుండా 

 నన్ను తోస్తూ 
క్షమిస్తూ 
హింసిస్తూ 
నిరాశా
 విత్తనాలు ఎడారిపూల 
సమాధుల కింద కప్పబడ్డాయి

Monday, June 9, 2014

సంపూర్ణం

పచ్చని మొక్కలు కొన్ని నన్ను చూసి నవ్వినప్పుడు 
ఆకాశపు హదయం మట్లాడినప్పుడు 
ఇల్లంతా చెట్లై ఒంటినిండా కొన్ని పూలు పూస్తాయి

 అనుభవాల పొట్లం నా ముందు వడ్డించని విస్తరిగా 
గుల్మొహర్ గబ్బిలాలు కళ్ళు తెరచి ఇంటివెనుక కాపు కాస్తుంటే
సముద్రపు నవ్వులు కురుస్తాయి 
వాటిని దోసిలి బొక్కెనలో మోసుకుంటూ తీసుకెళ్ళా

స్వాతంత్రం పొందిన కుక్కలు నిన్ను ఆహ్వానిస్తుండగా 
ఇటుకల గూటిలో పిచ్చుక విడిచిన వస్త్రాలను రెటీనాపై కప్పుకున్నా

 ప్రకృతి చేతులు కెలికిన వర్ణచిత్రాలు జీవం పోసుకుంటాయి అమ్మానాన్నలుగా

 పసిపాదాలు  మిగులుతాయి ఒకానొక కుండీలో

 రోజు గడిచింది సనాతనంగా ప్రక్షాళణ చెందిన ఆత్మను కలిసాక

Thursday, June 5, 2014

కొత్తపదార్థం


ఎక్కడో దూరంగా నిలబడి నాపైన పరచుకున్న ఆకాశాన్ని చూస్తుంటాను
నా చేతులు బారగా చాపి దాన్ని కొలవడానికి ప్రయత్నిస్తుంటాను

కాని అక్కడెవరో కొన్ని రంగురాళ్ళను అతికించినట్లుగా కొన్నినక్షత్రాలు
అప్పుడు నా కాళ్ళ కింద నన్ను పడిపోకుండా మోస్తూ ఒక భారి పదార్థం

చుట్టూతా కొంత గాలి
నా ముక్కుల్లోంచి,చెవుల్­లోచి ఏకదాటిగా నన్ను దాటుకుంటూ

ఇక అప్పుడక్కడ నాలాగే నిలబడ్డ ఓ శరీరానికి నా వీపును ఆనుస్తూ రాళ్ళపరుపైన నా కళేభరం

మిట్టమధ్యాహ్నపు ఎండలో నీటి వాసనలా ఒక అనుభూతి నాలోకి నన్ను లాగేస్తూ
అప్పుడనుకుంటాను కాసేపు ఎక్కడోచోట మత్తుగా పడుకుందామని
కాని నడిచి నడిచి రక్తం కక్కుతున్న పాదాలను చూసి ముఖానికి అద్దుకుంటాను ఉపశమనం ఇద్దామని

సరే ఇక వెళ్ళు నేనిక్కడే ఉంటాను ఈపూట అని చెప్పినా కదలకుండా కొన్ని వస్తువులు నన్నంటుకొని
గట్టిగా బిగించిన ఆ కౌగిలిలో రెక్కలు తేలికైన శబ్ధం నాకుమాత్రమే వినిపిస్తూ

మళ్ళా వెనక్కి వచ్చి గదిలో కూర్చున్నాక పైకప్పు మధ్య ఓ సాలీడు వ్యవసాయం చేస్తూ
చదునుగా అల్లిన ఓ చిన్న బంగ్లా

విశాలంగా ఇంకో హృదయం మొలకెత్తాలి కొత్తగా జీవించడానికి

కొత్త కాళ్ళు


కొత్త కాళ్ళ పుట్టుక నాలో
పాత దారులే
నడకే నూతనం

దారంతా ముళ్ళ ముచ్చట్లే
రాళ్ళ గుసగుసలు రాత్రంతా

ఖాళీ ఆకాశాన్ని నింపే ప్రయత్నంలో తారా కూటమి
నీలపు రంగులో ఈదుతున్న ఓ జడపదార్థం

నన్ను మోస్తున్న రెండు పునాదులు
చెమ్మ ఇంకని ఆసరా వనం నా కళ్ళు

మంచి నీళ్ళే...గొంతు గోడలకు కొత్త రుచిని పరిచయం చేస్తూ ఈ పూట 
అలసటకు ఆలంభనగా

ఇంకాస్త దూరమే
గమ్యం నా ముందు

కళ్ళ నడక


ఒకానొక రాత్రిలో ఒంటరిగా నడుస్తూ నేను
దారిలో పోసిన కంకర్రాళ్ళలో కొత్త సుగంధాన్ని ఆస్వాదిస్తూ 
పాక్షికంగా  అగుపించే మిణుగురుల భుజాలపై చేతులేసుకుంటూ

ఇంతలో అరికాల్లో ఏదో బాధ
కళ్ళ తలుపులు తెరవగానే భళ్ళున ఒలికిన కొన్ని నీళ్ళూ 

ప్రతిరోజూ నిర్లిప్త వక్షాల మధ్యగా నా శరీరం వదిలిన భారాన్ని 
మొస్తున్న ఓ ఆత్మను పట్టించుకోని నిశ్చల పదార్థం

కొన్ని సమయాలు అడుగంటిన బావుల్లో సగం కాలిన ఆశలను చేద వేస్తూ 
అలసిపోయాక అక్కడెక్కడో మళ్ళా విశ్రమిస్తూ  ఇంకో కొత్త ప్రయాణానికి కసరత్తు 

గతాల ముందు నిబ్బరంగా మోకరిల్లాలని చాలాసార్లే అనుకుంటాను 
కాని నాలోకి నేను జారిపోయినప్పుడల్లా దివిటీ కరిగిన శబ్ధ నిర్మాణాలు 

ఒరుసుకుపోయే ఆలోచనలు శ్రామికులై కూలిపోని పునాదుల దాకలాలను 
కనిపెట్టే ప్రయత్నంలో మళ్ళీ నడక మొదలు ఇంకో దిశగా



Wednesday, June 4, 2014

ఖాళీ సముద్రం


సముద్రపు కళ్ళు
మట్టిని నింపుకున్న తీరాలు
అలలన్నీ అలసి ఒడ్డుకొచ్చి కూర్చుందామనుకున్నాయి
కాని వేళయ్యిందంటూ ఇంట్లోకి లాక్కుపోయింది

ఇసుక చీమల వరుస తీరం
తెల్లవార్లు మట్టి కంపే

డొక్కలెండిపోయిన శూన్యం
చంద్రుడి భోజనం

ఓ ప్రక్కగా వెళ్ళిపోతున్న సూరీడు
రోజూ నీళ్ళోదులుతూనే

తూరుపు రెక్కలు విరిగిపోయాక
పడమర అస్తమయపు అతుకులు

కొత్త నిశాచరాలు గుండెగతుకుల్లో
సుడులదారాల్లా వేలాడుతూ

నీరెండ పలకరింపు నిత్యం కళ్ళునులుముకున్నాక
నిశ్చలమైన శరీరం ఉప్పుకణికలై
తిలక్

Tuesday, June 3, 2014

చరమాంకం


రోడ్డును హత్తుకున్న నీరెండొకటి
చీకటికి చుట్టమవుతూ మాయమవుతోంది

వన్యపు స్తన్యాన్ని నరుకుతున్న చేతులు
అప్పుడప్పుడు నీళ్ళొదులుతోంది కాటికి కట్టెలు కరువయ్యేదాకా  

రెండు కళ్ళలో ఇంత పచ్చదనాన్నీ పోసుకుంటావు చూడూ
నువ్వు సంపాదించినట్టు

తెల్లరక్తం ఆ పూలముఖాలపై
ఎక్కువ కాలం వనాన్నీ తమలోకి తోడుకోలేక

కొత్త వర్షం పలకరిద్దామన్నా పిలవలేని
నిస్సహాయతలో ఓ సజీవ కళేభరం

పరిది విస్తరించిందిగాని
పరిమితిని కాపాడుకోలేక మట్టిగా మిగిలింది

ఆనవాళ్ళను మిగుల్చుకోలేక
ఆశలను వేర్లతుంగలో తొక్కి
స్థాణువై నానుతూ
తిలక్