Wednesday, June 25, 2014

కొత్త అస్థిపంజరం



నా కళ్ళు వాటి చూపులతో నేలపై కొన్ని దృశ్యాలను రుద్దుతుంటాయి ప్రతి క్షణం
వాటికెప్పుడు ఒకేలా కనిపించే నిర్లిప్త ప్రతిబింబాలు

మసక పదాల్లో అర్థవంతమైన అక్షరాలతో కుస్తీ పడుతూ ఓ వ్రాత

శరీరంతోనూ చూద్దామని యత్నించాను చాలాసార్లు
అయినా ఎక్కడా అగుపించని కోణాలు

కొన్ని గడ్డకట్టిన కాలపు సమాధులపై శాసనాలుగా లిఖించిన శవాల గంజి
పగటి సాంబ్రాణిలో వత్తుల సుగంధం ఇంకిపోలేదింకా మనసుపుటాలలో

మౌనంలో మాటలు తగలేసినపుడు భావాలను బలవంతంగా బందిస్తూ కొన్ని శృంఖలాలు

ఇంకా ఎన్ని విస్పోటనాలు జరగాలోగుండే శివారుల్లో నిశ్శబ్ధంగా
మళ్ళీ అప్పుడు అద్దుతాను ఇంకొన్నిరూపాలను మచ్చిక చేసుకుంటూ

తెగిన మాటలను మనసు సైగల్లో అతుకులేస్తూ గాలి బుడగలు
నేను ఇన్నాళ్ళూ ఉంటున్నఅస్థిపంజరమే/ఈరోజు కొత్త దృశ్యాలను కక్కుతోంది

No comments:

Post a Comment