ఈ రాత్రి కొన్ని నక్షత్రాలు
ఆకాశానికి వేలాడుతూ సత్యాలుగా కనబడుతూ/
పగలు మళ్ళా అదృశ్యమవుతూ అబద్దాలుగా పరిక్రమణం
విచ్చిన్నమో
విభజనో తట్టని నిర్జీవ పాలపుంతలు అక్కడక్కడా
ఈరోజు మళ్ళా బాల్కనిలో కూర్చోవాలి కాసేపు వీటిని లెక్కించడానికి వేళ్ళ బెత్తంతో
దండెం మీద వేసిన పాత చొక్కాలా రోజు అవే నక్షత్రాలు అటూ ఇటూ మారుతూ
ఎవరో కాసిని బియ్యపు గింజలను ఇక్కడ జల్లారు మొలకెత్తకుండా అడుగంటేవి
కనిపించకుండా కనుమరుగయ్యేవి
కూటమి మొత్తం ఒక్కసారిగా పళ్ళికిలించిందా అనంత తారాజువ్వలు ఎవరూ విసరకుండానే నింగిలో
ఇప్పుడు ఇంకొన్ని కొత్త ఆశలను స్వప్నిస్తూ ఈ రాత్రి గడపాలి నేను
No comments:
Post a Comment