Friday, June 20, 2014

రెప్పల కిటికీ


కిటికీ బయట ఒళ్ళు విరబూసుకుని పడుకున్న చీకటి
రాత్రిని ఎక్కువగా తాగినట్టుంది
ఒకటే మత్తు వాసన

నక్షత్రాలు కూడా తమ శరీరంలో ఖాళీలను నింపలేనంతగా తయారయ్యింది

కొండలు
చెట్లు
ఆకులు
పువ్వులు
అడవులు చిక్కగా మునిగిపోయాయి
చేతులు కాళ్ళ నిండా నల్ల రక్తమే

నా కళ్ళు ఎంతసేపు అద్దుకున్నాయో రెప్పల తలుపులు మూసేశాయి రాత్రి ఎప్పటికో

ప్రొద్దున్నే నే లేచాక చూసిన తెల్లటి ఉమ్మెత్త పూల నురగ అక్కడంతా/ఇంతలా నిండిన చిక్కదనం మాయమయ్యాక ఇక ఎప్పటికీ నమ్మబుద్దికాలేదు నాకు

నాకు తోడుగా ఉంటుందనుకున్న పదార్థమేదో కొత్త రంగేసుకుపోయాక మిగలాలనిపించలేదిక్కడ

పచ్చికలన్నీ ఏడ్చి ఏడ్చి తమ శరీరంపై నీళ్ళ బిందువులయ్యాయి ఈ క్షణం/కణాలన్నీ కదలలేక మెదలలేక ఒంటరి యుద్ధంలో పావురాళ్ళై నేలకొరిగాయి

ఇక ఎప్పుడూ ఎదురుచూడలేదు మళ్ళా కరిగిపోయే దానికోసం

No comments:

Post a Comment