నిన్న రాత్రి కొన్ని కోరికలను వేలాడదీశాను ఆశల కొక్కానికి
తుప్పు పట్టి రాలిపోడానికి సిద్దంగా ఉన్న మంచురెక్కలు
ఇంకా సరిగ్గా దర్పణం కానీవీనూ
పారదర్శకంగా ప్రసరించినవీనూ
మూడొందల అరవై డిగ్రీల్లో సదా మనసు భ్రమణం
నిశ్చింతల రేవు దాటేశాక ఆరని మోహాల మత్తులో ఈ దేహం ఇంకా జోగుతూనే
సంక్లిష్టంగా పరిభ్రమణం చెందక తెప్పరిల్లిన సరంజామా బూజు పట్టి అందవికారంగా వాంతి చేసుకుంటూ మళ్ళా పుడుతూ
నేలపై అంగుళపు ధూళి బిర్రుగా కౌగిలించుకున్నకా ఒంటి చీపురుతో అప్పుడప్పుడు ఊడ్చే ప్రయత్నం
పింగాణీల్లో హృదయాలను దులుపుకున్నాక ఎడారిలో ఒంటరిగా కళ్ళాపి జల్లుకుంటూ తడియారని తలపుల్లో ఇంకా బ్రతుకీడ్చుకుంటూ
ఇక ఇప్పుడు చీకటి పరదా తొలగింది
మళ్ళా కొన్ని కోరికలు పుట్టాలి ఈవేళ
No comments:
Post a Comment