ఎక్కడో దూరంగా నిలబడి నాపైన పరచుకున్న ఆకాశాన్ని చూస్తుంటాను
నా చేతులు బారగా చాపి దాన్ని కొలవడానికి ప్రయత్నిస్తుంటాను
కాని అక్కడెవరో కొన్ని రంగురాళ్ళను అతికించినట్లుగా కొన్నినక్షత్రాలు
అప్పుడు నా కాళ్ళ కింద నన్ను పడిపోకుండా మోస్తూ ఒక భారి పదార్థం
చుట్టూతా కొంత గాలి
నా ముక్కుల్లోంచి,చెవుల్లోచి ఏకదాటిగా నన్ను దాటుకుంటూ
ఇక అప్పుడక్కడ నాలాగే నిలబడ్డ ఓ శరీరానికి నా వీపును ఆనుస్తూ రాళ్ళపరుపైన నా కళేభరం
మిట్టమధ్యాహ్నపు ఎండలో నీటి వాసనలా ఒక అనుభూతి నాలోకి నన్ను లాగేస్తూ
అప్పుడనుకుంటాను కాసేపు ఎక్కడోచోట మత్తుగా పడుకుందామని
కాని నడిచి నడిచి రక్తం కక్కుతున్న పాదాలను చూసి ముఖానికి అద్దుకుంటాను ఉపశమనం ఇద్దామని
సరే ఇక వెళ్ళు నేనిక్కడే ఉంటాను ఈపూట అని చెప్పినా కదలకుండా కొన్ని వస్తువులు నన్నంటుకొని
గట్టిగా బిగించిన ఆ కౌగిలిలో రెక్కలు తేలికైన శబ్ధం నాకుమాత్రమే వినిపిస్తూ
మళ్ళా వెనక్కి వచ్చి గదిలో కూర్చున్నాక పైకప్పు మధ్య ఓ సాలీడు వ్యవసాయం చేస్తూ
చదునుగా అల్లిన ఓ చిన్న బంగ్లా
విశాలంగా ఇంకో హృదయం మొలకెత్తాలి కొత్తగా జీవించడానికి
No comments:
Post a Comment